పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత.
మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్‌లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది.
బనానా సిల్క్ నేతపై శిక్షణ..
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు.
బనానా దారంతో నేత
అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్‌కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్‌గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది.
బనానా దారం తయారీకి చర్యలు ..
బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్‌టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment