
సాక్షి, అమరావతి: దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానికులు, మత్స్యకారుల అభ్యంతరాలను పరిష్కరించి, వారి ఆమోదం తెలిపిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారుల ఆందోళనలు, సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దివీస్ యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికుల అభ్యంతరాలన్నీ పరిష్కరించి, వారి ఆమోదం తెలిపే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదన్న ప్రభుత్వ ఆదేశాలకు దివీస్ ఫార్మా డైరెక్టర్ కిరణ్ దివి అంగీకరించారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను దివీస్ యాజమాన్యం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడంతోపాటు నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపై కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ రవీన్‌రెడ్డి, తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎండీ వివేక్‌యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనలివీ
► దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై మోపిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలి. కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి.
► మత్స్యకారులకు అవగాహన కల్పించి, వారు స్పష్టమైన అంగీకారానికి వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి. పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలను తప్పనిసరిగా స్థానికులకే ఇవ్వడంతో పాటు సీఎస్‌ఆర్ నిధులతో పాటు సమాజ హితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.
► అవసరమైతే స్థానికులకు ఉద్యోగాల నిమిత్తం నైపుణ్య సహకారం అందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు.
► దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు హామీ ఇవ్వాలి.
► దీనిని ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ఎండీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment