కార్పొరేటర్లు శాంక్షన్ చేసిన పనులకు ఎమ్మెల్యే గద్దె ప్రచారం
గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులు మళ్లీ ప్రారంభం
ఇదేం చోద్యం అంటున్న నియోజకవర్గ ప్రజలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేటర్లు కౌన్సిల్‌లో శాంక్షన్ చేయించిన పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానే చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ పనులను మంజూరు చేయించిన కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా ప్రచారం కోసం టెంకాయలు కొట్టి శంకస్థాపనలు చేస్తుంటే ఇదేమీ చోద్యం అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత ప్రభుత్వంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ అంతా తన ఘనతే అంటూ ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తుంది.
ఇవే నిదర్శనం..
మూడో డివిజన్‌లోని రామచంద్రానగర్, నాగార్జున నగర్‌లో రోడ్లు నిర్మాణం కోసం ఎన్నికలకు ముందుకు కౌన్సిల్‌లో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బారావు ప్రతిపాదనలు పెట్టారు. ఆ పనులను అడ్డుకునేందుకు టీడీపీ వాళ్లు ప్రయత్నం చేయగా, కార్పొరేటర్, కో ఆప్షన్ సభ్యుడు పట్టుబట్టి వాటిని మంజూరు చేయించారు. ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్లి, ఆ పనులకు శంకుస్థాపన చేసి అంతా తన ఘనతే అని చెప్పుకుంటున్నారు.
నాల్గవ డివిజన్ ఎనీ్టఆర్ కాలనీలో 2021లో పార్కు, జిమ్‌ను ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో, నాటి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. వాటిని మళ్లీ ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్లి రిబ్బన్ కట్ చేశారు. ఒకసారి ప్రారంభించిన పనిని మళ్లీ ప్రారంభించడం ఏమిటనీ ఆ ప్రాంత వాసులు నవ్వుకున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి.
అవన్నీ ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిచిపోయాయి. వాటన్నింటికి శంకుస్థాపనులు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు నాసిరకంగా కొంతమేర రిటైనింగ్‌వాల్ నిర్మించి, రిటైనింగ్ వాల్ ఘనత తమదే అంటూ ప్రచారం చెప్పుకోవడం విశేషం. తూర్పు నియోజకవర్గంలో 2014–19 కాలంలో కూడా కార్పొరేటర్లు చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకుంటున్నారని నాడు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.
నాడు అడ్డుకున్నారు..
నాగార్జున నగర్, రామచంద్రానగర్‌లలో రోడ్ల నిర్మాణం కోసం కౌన్సిల్‌లో పెడితే టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కానీ పట్టుబట్టి ఆమోదం చేయించాం. ఇప్పుడు మాకు చెప్పకుండా శంకుస్థాపన చేసి, వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. తాను కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత డివిజన్‌లో రూ.25 కోట్లతో అభివృద్ధి చేశాం. అంతా కళ్లకు కనిపిస్తుంది. ఎవరు అభివృద్ధి చేశారో కూడా ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వంలో దేవినేని అవినాష్ సహకారంతోనే అభివృద్ధి చేయగలిగాం.
– భీమిశెట్టి ప్రవల్లిక, 3వ డివిజన్ కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment