సాక్షి, నెల్లూరు(క్రైమ్): కొడుకు తనను విడిచి విదేశాలకు వెళ్తున్నాడని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని న్యూమిలటరీ కాలనీ 6వ క్రాస్‌రోడ్డులోని సాయిబాబా మందిరం వద్ద చల్లా పెంచల నరసింహారెడ్డి, విజయకుమారి (45) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి సదాశివారెడ్డి, భరత్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు.
చిన్న కుమారుడైన భరత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, పెద్ద కుమారుడు సదాశివారెడ్డి బీటెక్ పూర్తి చేయగా, ఫారిన్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అతను వెళ్లడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈక్రమంలో పెంచల నరసింహారెడ్డి అయ్యప్పమాల వేసి ఈనెల 18వ తేదీన శబరిమలకు వెళ్లాడు. దీంతో సదాశివారెడ్డి తల్లి విజయకుమారితో తాను విదేశాలకు వెళ్తానని చెప్పాడు.
ఇంటి బాధ్యతలు చూసుకోవాలని, అలా కాకుండా విదేశాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కొడుక్కి చెబుతూ ఉండేది. అయినా సదాశివారెడ్డి మాత్రం ఈనెల 25వ తేదీన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయకుమారి బుధవారం ఇంట్లోని బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వేదాయపాళెం పోలీసులకు భరత్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment