షెకావత్‌కు జ్ఞాపిక అందజేస్తున్న విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదిపై ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి చట్టప్రకారం వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానాలను వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను తెలియజేసి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రజలశక్తి మంత్రితో భేటీ అయినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ ఏవిధంగా చట్ట విరుద్ధమో కేంద్రమంత్రికి వివరించినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లాలోని నరవ వరకు పైపులైను ద్వారా తాగునీరు తరలించే ప్రాజెక్టుకు అయ్యే రూ.3,573 కోట్లలో సగం కేంద్రం భరించాలన్న విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని ఏడాది కిందట దాఖలు చేసిన పిటిషన్‌పై మరోసారి సహచర ఎంపీలతో కలిసి సభాపతి ఓం బిర్లాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా రఘురామ చేసిన అసంబద్ధమైన, చట్టవ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలను సభాపతికి సమర్పించామన్నారు. అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే 6 నెలల్లో సభాపతి నిర్ణయం ప్రకటించాలని గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లామన్నారు. తగిన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే రాబోయే సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment