
సాక్షి, అమరావతి: దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. తిండి కొరతవల్ల కాకుండా ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువమంది ఈ లోపం బారిన పడుతున్నారు. నిజానికి.. దేశంలో తలసరి ఆహార ఉత్పత్తి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 1980 ప్రారంభంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక కిలోకంటే కొంత ఎక్కువగాను.. ఇటీవల కాలంలో 1.73 కిలోల ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య, పోషకాహార సూచికలు పేలవంగా ఉన్నాయని.. ఈ సూచికల క్షీణత ఆందోళన కలిగిస్తోందని నాబార్డు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2021 వెల్లడించింది. నివేదికలో పొందుపర్చిన సూచనలు, ఇతర ముఖ్యాంశాలివీ..
► దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
► 15–49 ఏళ్లలోపు మహిళల్లోని 57 శాతం మందిని కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. 2015–16తో పోలిస్తే పిల్లల్లోనూ, మహిళల్లోనూ ఇది పెరగడం ఆందోళన కలిగించే అంశం.
► ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధాన కారణం.
► పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లు కారణంగా ఈ లోపాలబారిన పడుతున్నారు.
► ఎక్కువగా కారం, నూనె, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడమే కారణం.
► ఈ లోపానికి పూర్తిగా కొనుగోలు సామర్థ్యం తక్కువగా ఉండటం కారణం కాదు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల వారిలో కూడా ఈ లోపాలున్నాయి.
► ఈ లోపంతో పిల్లలు బరువు తక్కువగా ఉండటం చాలా సాధారణమైంది.
► శరీరం పోషకాలను గ్రహించడం కూడా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి.
► ఆరోగ్య సూచికలను మెరుగుపరచడానికి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం.
► ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి.
► రసాయన అవశేషాల వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment