
సాక్షిప్రతినిధి, తిరుపతి: ‘రామోజీరావుగారూ.. తప్పుడు రాతలు రాసి మామధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నావు. మీ రాతలను ఎవ్వరూ నమ్మరు. నమ్మేరోజులు పోయాయి..’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. తాను వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడినంటూ ఈనాడులో గురువారం అసత్య, తప్పుడువార్త రాశారని మండిపడ్డారు.
ఆయన గురువారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని యువకుడు, ఎమ్మెల్సీ భరత్‌కి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. భరత్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ దళితులకు పెద్దపీట వేశారని చెప్పారు. సీఎం సహకారంతో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన తాను జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడే వ్యక్తిని కాదని తేల్చిచెప్పారు. దళితులను కించపరిచేవిధంగా మరోసారి తప్పుడు రాతలు రాస్తే క్షమించేదిలేదన్నారు.