
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): భర్త వేధింపులు తాళలేక ఓ తల్లి తన కొడుకును డ్రైనేజీలో పడేయగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడలోని కామినేనినగర్ డొంకరోడ్డు కాలనీలో జరిగింది. వల్లెపు మీనాక్షి డొంకరోడ్డు కాలనీకి చెందిన జయరాంను ద్వితీయ వివాహం చేసుకుంది. వీరికి 6 నెలల కిందట సామ్యేలు జన్మించాడు. మీనాక్షిపై భర్తకు అనుమానం పెరిగింది. జయరాంకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉంది.
ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో విసిగిపోయిన మీనాక్షి బుధవారం ఉదయం 5 గంటలకు సామ్యేలును తీసుకొని కాలనీ పక్కనే ఉన్న గుంటతిప్ప డ్రైనేజీలో పడేసింది. కాలనీ వాసులు సామ్యేలు కోసం డ్రైనేజీలో గాలించారు.
సామ్యేలు మృతదేహాన్ని బయటకు తీసి విషయాన్ని పటమట పోలీసులకు చెప్పారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు.