
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరోవివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ లీవ్‌లో వెళ్లిన అధికారిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సాయిప్రసాద్‌పై ఈ మేరకు తీవ్ర చర్య తీసుకున్నారు. జీవీ సాయిప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఆదివారం నుంచి నెలరోజులపాటు మెడికల్ లీవ్ పెట్టారు. ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు.
ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయిప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకోవడం గమనార్హం. కనీసం ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం, అంతేగాక పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన ఉత్తర్వులలో పేర్కొనడం ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 8న ఎన్నికల కమిషనర్ వెలువరించిన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం హైకోర్టు కొట్టివేయడానికి ముందుగా నిమ్మగడ్డ ఈ ఉత్తర్వులిచ్చారు. నిమ్మగడ్డ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి.
సాయిప్రసాద్‌ని డిస్మిస్ చేయడం దుర్మార్గం
రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్‌ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. సెలవు దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎన్నడూ చూడలేదన్నారు. సస్పెండ్ చేసినా ఒకరకం కానీ ఏకంగా డిస్మిస్ చేయటం దారుణమన్నారు. నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.