
పాతపట్నంలో సోమవారం పట్టుబడిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఒడిశా వసారాలో సారా నిరంతరం ప్రవహిస్తోంది. దారిలో మన పల్లెలనూ ముంచెత్తుతోంది. జి ల్లాలోని సరిహద్దు గ్రామాలు సారా తయారీ స్థావరాలుగా మారుతున్నాయి. ఇలా 98 గ్రామాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. దాదాపు 200 మంది సారా తయారీ, విక్రయాలపై ఆధారపడి పని చేస్తున్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడీ ప్రాంతాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారులు దృష్టి సారించారు.
ఎన్నో మార్గాలు..
ఒడిశాను ఆనుకుని ఉన్న కొత్తూరు, పాతపట్నం, ఇచ్ఛాపురం, మందస, భామిని, మెళియాపుట్టి మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారు. అలాగే తీర ప్రాంత గ్రామాల్లోకి కూడా ఒడిశా నుంచి సారా వస్తోంది. సముద్రంలో బోట్ల ద్వారా రవాణా చేసి, మన జిల్లాకు చెందిన మత్స్యకార బోట్లకు అందజేస్తున్నారు. అక్కడి నుంచి కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. అలాగే విజయనగరం ఒడిశా సరిహద్దు గ్రా మాల నుంచి వీరఘట్టం, పాలకొండ తదితర ప్రాంతాలకు నాటుసారాను తీసుకొస్తున్నారు.
పల్లె పల్లెకూ..
అధికారులు ఇప్పటివరకు 220 కార్డన్ సెర్చ్‌లు నిర్వహించగా ఈ వివరాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గంగాపూర్‌కు ఆనుకుని ఉన్న బాతుపురం, విక్రంపురం గ్రామాలకు కొండ పై నుంచి నాటుసారా తీసుకొస్తున్నారు. కావడిలు వేసుకుని బ్యాగులతో తీసుకొస్తున్నారు. మందస మండలం కొండలోగాం, పుట్టు లోగాం, చాపరాయి, పతగాం, లువగడ తదితర ప్రాంతాలకు, సముద్ర తీర ప్రాంత గ్రామాలైన డంకూరు, కవిటి, కపాసకుద్ది తదితర గ్రామాలకు ఈ రకంగా నాటు సారా వస్తోంది. అలాగే విజయనగరం ఒడిశా సరిహ ద్దు నుంచి రెల్లివీధి, తెట్టంగి, మీనానగరం, హుస్సేన్‌పురం, పనసనందివాడ, కోతుల గుమ్మడి తదితర ప్రాంతాలకు నాటుసారా రవాణా అవుతోంది. వీటిన్నింటినీ స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. 18 ఎంట్రీ పా యింట్లు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. దాదాపు 98 గ్రామాలు నాటుసారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే 3535కేసులు పెట్టి, 3496మందిని అరెస్టు చేసి, 770 వాహనాలను సీజ్ చేశారు. 33,670 లీటర్ల ఐడీ లిక్కర్, 6లక్షల 27వేల 335లీటర్ల బెల్లం ఊటలు, 1864 కిలోల బెల్లం, 3,633 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుకున్నారు. బెల్లం ఊటలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు.
రసాయనాలు ఉన్నాయా..?
సోంపేట మండలం సిరిమామిడిలో చోటు చేసుకున్న సంఘటనతో నాటుసారాలో మిథైనల్ ఏదైనా కలుపుతున్నారా? అనేది తెలుసుకోవడానికి నమూనాలను కెమికల్ ల్యాబ్‌కు పంపించగా అలాంటిదేమీ లేదని తేలింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని బాధ్యులుగా గుర్తించి ఇద్దర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో పోలీసు, ఎక్సైజ్ అధికారులు మరింత సీరియస్‌గా దృష్టి సారించారు. ఒడిశా నుంచి పూర్తి స్థాయి లో సహకారం కొరవడటంతో అక్కడకక్కడ జిల్లాలోకి నాటు సారా రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఒడి శా అధికారులతో సంప్రదింపులు జరిపి జాయింట్ ఆపరేషన్ చేసి నాటుసారా తయారవుతున్న సరిహద్దు గ్రామాలపై దా డులు చేసి నియంత్రించడానికి కార్యాచరణ రూపొందించా రు. ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు జాతీయ రహదారిపై 36పాయింట్ల వద్ద, సముద్ర తీర ప్రాంతంలోని 28పాయింట్ల వద్ద, విజయనగరం–ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి 36పాయింట్ల వద్ద, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొత్తూరు మీదుగా వచ్చే ప్రాంతాలకు సంబంధించి కొన్ని పాయింట్లు పెట్టుకుని తనిఖీలు చేసే కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఒడిశా నుంచే వస్తోంది..
ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి నాటుసారా జిల్లాలోకి వస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను గుర్తించాం వాటిపై దాడులు చేస్తున్నాం. పలు కేసులు కూడా పెట్టాం. లక్షలాది లీటర్ల బెల్లం ఊటలు «ధ్వంసం చేశాం. కరోనా వ్యాప్తి చెందిన దగ్గరి నుంచి ఒడిశా నుంచి సహకారం కొరవడింది. త్వరలోనే వారితో సంప్రదింపులు చేసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తాం. తయారీదారుల్లో కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం.
– శ్రీనివాసరావు, ఏఎస్పీ, స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో
Comments
Please login to add a commentAdd a comment