సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు పంచాయతీ కొత్తపేట కాలనీలో గురువారం కన్నతండ్రిని కుమారుడు నరికిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యాల నారాయణకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు కొయ్యల పోలయ్య గురువారం ఉదయం 8 గంటల సమయంలో మద్యం కోసం డబ్బులు కావాలని తన భార్య లక్ష్మిని అడిగాడు.
డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న తండ్రి నారాయణ కలగజేసుకోవడంతో కోపోద్రిక్తుడైన పోలయ్య.. తండ్రి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. తల వెనుక, ఇతర శరీర భాగాల్లో నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కత్తితోనే బయటకు వచ్చి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలయ్యను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నారాయణను 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. జిల్లా క్లూస్‌టీం సభ్యు లు రమేష్, ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment