మంత్రి సుభాష్ తీరుతో లబోదిబోమంటున్న బాధితులు
రామచంద్రపురం రూరల్ : వ్యవసాయ కూలీలకు అందులోనూ మహిళలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ అంశం రామచంద్రపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజువారీ కూలిపని చేసుకునే మహిళలకు మంత్రి నోటీసులు పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉందని.. మంత్రి చేసిన పని సరైంది కాదని వారంటున్నారు.
వివరాలివీ..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని తాళ్లపొలెం గ్రామ సర్పంచ్ కట్టా గోవిందుకు, ఆయన ఆడపడుచులకు కొంతకాలంగా 2.40 ఎకరాల పంట భూమి విషయమై కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టులో వివాదం సాగుతున్నప్పటికీ సర్పంచ్ కట్టా గోవిందు స్వాధీనంలోనే భూమి ఉంది. ఆయనే పంటలు పండించుకుంటున్నారు. అదే భూమిలో కొంతభాగం ఇటీవల మంత్రి అనుచరుడు దొంగల శ్రీధర్, అతని భార్య దొంగల సునీత పేరున రిజిస్టర్ అయ్యింది.
ఇటీవల సర్పంచ్ గోవిందు పంట కోసుకోగా దానిపై ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కట్టా గోవిందు, అతని సోదరి జానకమ్మ, మేడిశెట్టి ఇజ్రాయేలుతో పాటు 8 మంది వ్యవసాయ కూలీలు అందులోనూ మహిళలపై అక్రమంగా పంట కోసుకుపోయారని ఒక కేసు నమోదైంది. దీనిపై గతనెల 24న రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమక్షంలో అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఎవరైతే పోలీసు కేసులో ఉన్నారో అదే వ్యవసాయ కూలీలకు మంత్రి సుభాష్ లీగల్ నోటీసులు పంపారు. వారు మీడియాతో మాట్లాడటంవల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ఇచ్చిన ఆ నోటీసులను చూసి కూలీలు లబోదిబోమంటున్నారు. తమను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సుభాష్‌ను వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment