తల్లిని చేతులపై ఎత్తుకుని తనతో పాటు తీసుకెళుతున్న చిన్న కుమారుడు నాగిరెడ్డి
ప్రత్తిపాడు: ఏది ఏమైనా తల్లి ప్రేమకు మించిన అమృతం లేదు. పేగు తెంచుకుని పుట్టిన వారెన్ని కష్టాలు పెట్టినా తల్లికి వారిపై ఉండే ప్రేమానురాగం తరిగిపోదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ చిత్రం. నరసరావుపేటకు చెందిన మల్లమ్మ అనే వృద్ధురాలిని కుమారుడే నిర్ధాక్షిణ్యంగా అర్ధరాత్రి తీసుకువచ్చి ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులోని బస్‌షెల్టర్‌లో వదిలేసి వెళ్లిపోయాడంటూ గురువారం ‘సాక్షి’లో ‘అమ్మా’నుషం శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనం అన్ని శాఖల అధికారులను కదిలించింది.
తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు, ఎంపీడీవో టీవీ విజయలక్ష్మిల ఆదేశాల మేరకు సీడీపీవో వి.సుజాతదేవి గొట్టిపాడు సెక్టార్ ఇన్‌చార్జి సూపర్‌వైజర్ వై.రాజ్యలక్ష్మిని ఘటనా స్థలానికి పంపారు. మల్లమ్మ పరిస్థితిని పరిశీలించగా ఆమె బాగా నీరసంగా ఉండటంతో పాటు అనారోగ్యంగా ఉండటం గమనించి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రత్నశ్రీకి సమాచారం అందించారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలను వృద్ధురాలి వద్దకు పంపి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
కొడుకును పిలిపించిన పోలీసులు..
పేగు బంధాలను ప్రశ్నించేలా ఉన్న ఈ అమానవీయ ఘటనపై ప్రత్తిపాడు ఎస్‌ఐ డి.అశోక్ స్పందించారు. ఉదయాన్నే కానిస్టేబుల్‌ను నరసరావుపేటకు పంపి వాకబు చేయించారు. చివరికి చిరునామా తెలుసుకుని కొడుకు నాగిరెడ్డిని ప్రత్తిపాడు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తల్లిదండ్రులపై ఇలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో కొడుకుకు అప్పగించారు. ఆస్పత్రిలో కొడుకును చూసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యింది. వచ్చావా బిడ్డా.. నా కోసం వచ్చావా.. మా నాయనే.. అంటూ కొడుకు గెడ్డం పట్టుకుని బోరున విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారి కళ్లు చెమర్చాయి.
Comments
Please login to add a commentAdd a comment