సింగరాయకొండ/ఆత్మకూరు రూరల్(నంద్యాల) : జగనన్న సురక్ష క్యాంపులు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇటీవల ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడగా, తాజాగా ఓ మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వైకే నందకిషోర్ రోజూ నెల్లూరు నుంచి ఒంగోలుకు ఉద్యోగం నిమిత్తం వస్తుంటారు. ఈ నెల 5న రైల్లో వస్తుండగా కావలి దాటగానే స్వల్పంగా గుండెనొప్పి వచ్చింది. మొదట గ్యాస్ సమస్య అని మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో వెంటనే తనకు రైల్లో పరిచయం ఉన్న సింగరాయకొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు.
ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఉజ్వల.. సింగరాయకొండ గ్రామ సచివాలయం–2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మెడికల్ క్యాంపు జరుగుతోందని, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు క్యాంపులో ఉన్నారని.. సింగరాయకొండలో దిగాలంటూ స్టేషన్‌కు 108ను పంపించి సురక్ష క్యాంపునకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వంశీధర్‌లు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వరరావు.. రిజిస్ట్రార్ కు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించి వెంటనే ప్రథమ చికిత్స చేయించి తర్వాత ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
కిమ్స్‌లోని డాక్టర్లు రిజిస్ట్రార్ నందకిషోర్‌కు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రెండు వాల్వస్ దెబ్బతిన్నాయని గుర్తించి.. వెంటనే స్టంట్ వేసి చికిత్స చేశారు. సకాలంలో అక్కడకు రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయని కిమ్స్ డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించి తన భర్త ప్రాణాలు కాపాడారని అతని భార్య విజయలక్ష్మి.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఉన్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కా>్యంపులో 35 మందికి ఈసీజీ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి గుండె సమస్యలున్నట్టు తేలిందని చెప్పారు.
ఓ మహిళను కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీపతిరావుపేటలో సోమవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ మహిళను కాపాడింది. జయలక్ష్మీదేవి కొద్దిగా ఆయాసం ఉందంటూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చింది. వైద్యులు ఆమెకు గుండె పరీక్షలు చేసి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం చేసి హుటాహుటిన అక్కడే ఉన్న అంబులెన్స్‌లో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment