సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో 84 మున్సిపల్ వార్డులు, నగర పాలక డివిజన్లలో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఆ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. తిరుపతి నగర పాలక సంస్థలోని 6 డివిజన్లతోపాటు వివిధ మున్సిపాలిటీలలోని 78 వార్డుల్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మార్చి 10న పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో గతేడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ మొదలై నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన ముగిశాక ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఎన్నికల ప్రక్రియ ఆగినచోట నుంచే ప్రారంభిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించడంతో మున్సిపల్ ఎన్నికలు సాఫీగా కొనసాగేందుకు వీలేర్పడింది. ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తవడం తెలిసిందే. పులివెందుల, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డుల్లో ఒక్క నామినేషన్ చొప్పునే దాఖలవడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుండగా.. అందులో 21 వార్డులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.
వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులుండగా.. 21 చోట్ల ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు పదహారుచోట్ల ఒక్కరే పోటీలో ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు పది, గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులకు పదిచోట్ల ఒక్క నామినేషన్ చొప్పునే దాఖలయ్యాయి. పులివెందుల, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో సగానికిపైగా వార్డుల్లో సింగిల్ నామినేషన్లే ఉండడం.. అవన్నీ అధికారపార్టీకి చెందినవారివే కావడంతో ఈ మూడుచోట్ల మున్సిపల్ చైర్మన్ పదవులు వైఎస్సార్‌సీపీ పరమైనట్టేనని భావించవచ్చు.
పంచాయతీల ఫలితాలు చూశాక...
ఎన్నికలు జరుగుతున్న 12 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మంగళవారం(మార్చి 2వ తేదీ) నుంచి నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ మొదలవనుంది. ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఇటీవలి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులే 80 శాతానికిపైగా సర్పంచ్ పదవులను గెలుచుకోవడం తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ అభిమానులకే ఓట్లేయడం చూశాక పట్టణ ప్రాంతాల్లో బరిలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు పలువురు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి ఉంటుందన్న భావనతో పోటీ నుంచి విరమించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
వాటిలో ఒక్క వార్డుకూ నామినేషన్లు వేయని టీడీపీ
మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ఒక్క వార్డుకూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. ఇందులో సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ 33 వార్డులుండగా.. 21 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా వార్డులలో ఇద్దరు కంటే ఎక్కువమంది నామినేషన్లు దాఖలైనప్పటికీ, అందులో ఎక్కువచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఇద్దరేసి చొప్పున పోటీలో ఉన్నారు. కనీసం ఒక్క వార్డులోనూ టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. జమ్మలమడుగు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఆ మున్సిపాలిటీలో బీజేపీ, జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలోనూ కనీసం ఒక్క వార్డులోనూ టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకపోవడం గమనార్హం. ఆ మున్సిపాలిటీలో సింగిల్ నామినేషన్ దాఖలైన పదివార్డులు గాక మిగతా 21 వార్డులకు రెండేసి నామినేషన్లు చొప్పున దాఖలైనప్పటికీ, వారంతా వైఎస్సార్‌సీపీకి చెందినవారే. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు ప్రతి వార్డులో ఒక్కరే బరిలో నిలిస్తే.. ఆ మున్సిపాలిటీలోని వార్డులన్నీ ఏకగ్రీవం కావడానికి వీలుంది.
84 వార్డుల్లో సింగిల్ నామినేషన్లే..
Published Sun, Feb 28 2021 3:25 AM | Last Updated on Sun, Feb 28 2021 5:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment