సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలపై గడిచిన ఏడున్నర నెలలుగా కరోనా మహమ్మారి ఎంతగానో ప్రభావం చూపింది. వైరస్ సోకుతుందనే భయంతో రోగులు.. ఉన్న జబ్బులకూ ఆస్పత్రులకు రాలేక ఇబ్బంది పడ్డారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలు నిలిపివేశాయి. ఈ ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులే అండగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రధానంగా సెకండరీ కేర్ అంటే సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులే కొలమానంగా చూస్తాం. ఆయా ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్ సేవలు 55%, ఇన్‌పేషెంట్ సేవలు 46% తగ్గిపోయాయంటే కరోనా ప్రభావం ఎంతగా చూపిందో అంచనా వేయవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశీలన మేరకు విధిలేని పరిస్థితుల్లో మినహా చాలామంది రోగులు ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది.(చదవండి: ఏపీలో రికార్డ్‌స్థాయిలో కరోనా పరీక్షలు)
వాయిదాకే మొగ్గు
- చాలామంది రకరకాల జబ్బులున్నా కరోనాతో భయపడి వాయిదా వేసుకున్నారు.
- అత్యవసరమైతే మినహా సర్జరీల జోలికి వెళ్లలేదు.
- చాలామంది దీర్ఘకాలిక జబ్బుల బాధితులు ఫోన్‌ల ద్వారానే డాక్టర్లను సంప్రదించి మందులు వేసుకున్నారు.
- నెలకోసారి లేదా మూణ్నెళ్లకోసారి రక్తపరీక్షలు చేయించుకునే వాళ్లు ల్యాబొరేటరీలకే వెళ్లలేదు. దీంతో 79% తగ్గినట్టు తేలింది.
- దగ్గు, జ్వరమూ వంటి లక్షణాలుంటే కరోనా అని భయపడి చాలామంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు.
- కరోనా సమయంలో రాష్ట్రంలో పారాసెట్‌మాల్, అజిత్రోమైసిన్ వంటి వాటితో పాటు విటమిన్ మాత్రలు భారీగా అమ్ముడు పోయాయి.
- విచిత్రమేమంటే కరోనా వైరస్ కారణంగా మానసిక వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
- కరోనాకు భయపడి జూలై మొదటి వారం వరకూ ప్రైవేట్ ఆస్పత్రులు తెరవలేదు.
- కరోనా సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14410 టెలీమెడిసిన్ నెంబర్ రోగులను ఆదుకుంది.
- టెలిమెడిసిన్‌లో భాగంగా సుమారు 50వేల మంది సేవలు పొందారు.
కోవిడ్-19కి భయపడి..
కరోనా వైరస్ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల సేవలే అండగా నిలిచాయి. వైరస్‌కు చాలామంది మానసికంగా భయపడ్డారు. అందుకే ఆస్పత్రులకు రావడానికి వెనక్కు తగ్గారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరికొద్ది రోజుల్లో పూర్తిగా నాన్-కోవిడ్ సేవలూ అందుబాటులోకి వస్తాయి.
- డా.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధానపరిషత్
వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందిన వారి వివరాలు:
కేటగిరీల వారీగా | ఏప్రిల్ 2019- ఆగస్ట్ 2019 | ఏప్రిల్ 2020-ఆగస్ట్ 2020 | తగ్గుదల శాతం |
ఔట్‌పేషెంట్లు | 98,98,095 | 44,87,235 | 55 |
ఇన్‌పేషెంట్లు | 9,04,751 | 4,90,119 | 46 |
మేజర్ సర్జరీలు | 39,328 | 28,103 | 29 |
కు.ని. ఆపరేషన్లు | 32,341 | 10,246 | 68 |
ప్రసవాలు | 74,041 | 66,393 | 10 |
ఎక్స్‌రేలు | 247105 | 1,00,074 | 60 |
ఈసీజీ | 95,269 | 48,758 | 49 |
ల్యాబ్ టెస్ట్‌లు | 95,46,780 | 20,24,452 | 79 |
Comments
Please login to add a commentAdd a comment