
చిన్నారులకు పరిహారం మంజూరు పత్రాలను అందజేస్తున్న మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్
పెడన: కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సీఎం వైఎస్ జగన్ మేనమామలా అండగా నిలిచారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలిసి మంత్రి పేర్ని నాని పెడన ఏడో వార్డులో జక్కుల లీలాప్రసాద్, భారతీ దంపతుల పిల్లలు ఉషశ్రీసాయి(11), జుహితేశ్వరి(5)లకు చెరో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ.. నాలుగు పదుల వయసు కూడా నిండకుండానే లీలాప్రసాద్, భారతీ చనిపోవడం.. వీరి ఇద్దరు ఆడపిల్లలూ అనాథలు కావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారని.. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో స్పందించి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు.
చెల్లిని బాగా చూసుకో..
ఈ సందర్భంగా ఉషశ్రీ సాయితో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ‘ఇక మీదట చెల్లికి అమ్మ, నాన్న అన్నీ నువ్వే. చెల్లిని ఏడిపించకుండా.. బాగా చూసుకోవాలి. నువ్వు కూడా మంచిగా చదువుకోవాలి’ అని ఉషశ్రీ సాయికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్ బళ్ల జ్యోత్సా్నరాణి, వైస్ చైర్మన్ ఎండీ ఖాజా, కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ పి.మధుసూదనరావు, ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, వార్డు కౌన్సిలర్ కటకం నాగకుమారి, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment