
సాక్షి, అమలాపురం: ‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కోరాకనే కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వం డ్రాఫ్ట్రు నోటిఫికేషన్ విడుదల చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకటించలేదని, మార్పు చేయాలని అన్ని పార్టీలు విస్తృతంగా డిమాండ్ చేశాయన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన డిమాండ్ చేసిందని, పేరు మార్పును బీజేపీ ఆహ్వానించిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తాళ్లరేవులో జరిగిన సమావేశంలో అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పేరు ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పేరు మార్పు మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్, ఆర్డీవోలకు చెప్పుకొనే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన కవ్వింపు చర్యలు చేపట్టవద్దని, ర్యాలీలు, ధర్నాలు చేయకుండా ఇక్కడి ప్రత్యేకతను కాపాడాలని మంత్రి విశ్వరూప్ కోరారు.