Polavaram Project: పోలవరంలో మరో కీలక ఘట్టం | Polavaram Lower Cofferdam Work Has Been Successfully Completed | Sakshi
Sakshi News home page

Polavaram Project: పోలవరంలో మరో కీలక ఘట్టం

Published Thu, Feb 16 2023 7:42 AM | Last Updated on Thu, Feb 16 2023 3:19 PM

Polavaram Lower Cofferdam Work Has Been Successfully Completed - Sakshi

సాక్షి, అమరావతి: బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం పనుల్లో బుధవారం మరో కీలక ఘట్టం పూర్తయింది. టీడీపీ సర్కారు నిర్వాకాలతో ఎదురైన సవాళ్లను అధిగమించి 1,655 మీటర్ల పొడవు, 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకోసం 34.83 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, కోర్‌ (నల్లరేగడి మట్టి), రాళ్లను వినియోగించింది.

గోదావరికి ఎంత భారీ వరద వచ్చినా ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోకి ఇక వరద ఎగదన్నే అవకాశమే ఉండదు. వరదల్లోనూ ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను కొనసాగించేందుకు మార్గం సుగమమైందని పోలవరం సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యంపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌) నివేదిక ఇవ్వడమే తరువాయి డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మార్గదర్శకాల మేరకు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను పూర్తి చేయడం ద్వారా రైతులకు పోలవరం ఫలాలను శరవేగంగా అందించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు.

టీడీపీ నిర్వాకాలతోనే జాప్యం..
♦గోదావరి గర్భంలో 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి వీలుగా ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన 2,840 మీటర్ల పొడవు, 43 మీటర్ల ఎత్తుతో ఒక కాఫర్‌ డ్యామ్‌ను, స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన జలాలు ఎగదన్నకుండా దిగువన 1,655 మీటర్ల పొడవు 30.5 మీటర్ల ఎత్తుతో మరొక కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి.

♦గత సర్కార్‌ నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తి చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కి పునాది వేసి కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయలేక చేతులెత్తేసింది. దీంతో 2019లో గోదావరి వరద ప్రవాహం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంతో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు ప్రదేశాల్లో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌ 0 నుంచి 680 మీటర్ల వరకు కోతకు గురైంది. 

♦సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పోలవరాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ ఎగువ కాఫర్‌ డ్యామ్, స్పిల్, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్‌లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీ. పొడవున మళ్లించారు.

♦అయితే దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశంలో పనులు చేపట్టాల్సిన విధానాన్ని ఖరారు చేయడంలో డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ జాప్యం చేశాయి.
చదవండి: సాకారమవుతున్న స్వప్నం 

ఆకస్మిక వరదలు రాకుంటే గతేడాదే పూర్తి..
♦దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశంలో జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుక నింపి జెట్‌ గ్రౌటింగ్, వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ పూడ్చి అనంతరం 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసే విధానాన్ని 2022 ఏప్రిల్‌లో సీడబ్ల్యూసీ నిర్దేశించింది. 
♦సాధారణంగా జూలై మూడో వారం నుంచి గోదావరికి వరదలు వస్తాయి. దేశంలో జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌ల వినియోగం తక్కువ. ఈ నేపథ్యంలో వాటి లభ్యత కూడా స్వల్పమే. సమయం తక్కువగా ఉండటంతో గుజరాత్, అస్సోం సంస్థలకు తయారీ ఆర్డర్‌ ఇచ్చి తక్కువ సమయంలోనే 2.50 లక్షల బ్యాగ్‌లు సేకరించారు. వాటిని ఇసుకతో నింపి కోతకు గురైన ప్రదేశంలో పూడ్చి జెట్‌ గ్రౌటింగ్‌ ద్వారా వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యధాస్థితికి తెచ్చారు.
♦ఆ తర్వాత దానిపై 20 మీటర్ల ఎత్తుతో గతేడాది జూలై 9 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేశారు. అయితే అదే రోజు రాత్రి భారీ వరద రావడంతో స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన వరద దిగువ కాఫర్‌ డ్యామ్‌ను ముంచెత్తింది. ఆకస్మిక వరదలు రాకుంటే గతేడాదే దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యేదని పోలవరం ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు.
♦ వరదలు తగ్గాక నవంబర్‌లో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించిన మేఘా సంస్థ బుధవారానికి పూర్తి చేసింది. గతేడాది భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో ఎంత ప్రవాహం వచ్చినా సమర్థంగా తట్టుకునేలా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు పెంచారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 30.5 మీటర్లతో కాకుండా 31.5 మీటర్లకు పెంచి పనులు పూర్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement