పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగానే ప్రాజెక్టు పనులను పరుగులుపెట్టిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ అధికారులు, పోలవరం నిర్మిస్తున్న మెఘా ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
పోలవరంలో మరో కీలక అంకానికి నేడు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లో కాంక్రీట్ పనులను ఇరిగేషన్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ నిపుణులు ఈ రోజు ఉదయం మొదలుపెట్టారు. 2020 జూలైలో వచ్చిన వరదల కారణంగా స్పిల్ ఛానల్ మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ 20 నుండి వరద నీటి తొడకం పనులు ప్రారంభించారు. ఇందుకు వరద నీటిని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేశారు. నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మొదలు పెట్టనున్నారు.
ఇప్పటివరకు 2.5 టీఎంసీల నీటిని గోదావరిలో తోడిపోసినట్లు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నీటి తవ్వకం దాదాపు పూర్తికావడంతో మట్టితవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 1,10,033 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్‌లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్‌లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment