గోదారి చెంత తాగునీటికి చింత | Godavari River Water Is Contaminated By Coffer Dam In Pudipalli, East Godavari | Sakshi
Sakshi News home page

గోదారి చెంత తాగునీటికి చింత

Published Fri, Jun 21 2019 10:48 AM | Last Updated on Fri, Jun 21 2019 10:48 AM

Godavari River Water Is Contaminated By Coffer Dam In Pudipalli, East Godavari - Sakshi

పూడిపల్లి వద్ద దిగువకు ప్రవహించకుండా నిలిచిపోయిన గోదావరి జలాలు

సాక్షి, దేవీపట్నం (తూర్పు గోదావరి): చెంతనే జీవనది గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ తాగేందుకు పరిశుభ్రమైన నీరు లేక మండలంలోని పూడిపల్లి వాసులు దాహంతో అల్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న పూడిపల్లి గ్రామం గోదావరి ఒడ్డునే ఉంది. ఆ దిగువనే గల పోశమ్మ గండి వద్ద నిర్మిస్తున్న కాఫర్‌ డ్యాం వల్ల గోదావరి నీరు దిగువకు పోయే అవకాశం లేకుండా పోయింది. వేసవిలో గోదావరి నదిలోని పాయ పూడిపల్లి, పోశమ్మ గండి వైపు నుంచే దిగువకు ప్రవహించేది. కానీ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో వీరవరం లంకకు ఆవల పశ్చిమ గోదావరి జిల్లా ఒడ్డు నుంచి నదీ పాయ ప్రవాహాన్ని మళ్లించారు. పూడిపల్లి వైపు నదిలో నిలిచిపోయిన నీరు ఆకుపచ్చగా మారి కలుషితమై, గ్రామస్తులు తాగేందుకు పనికిరాకుండా పోయింది.

నెరవేరని జేసీ హామీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బ్లాస్టింగ్‌ వల్ల పూడిపల్లి గ్రామంలోని ఇళ్లు బీటలు వారి, శ్లాబులు పెచ్చులూడుతున్నాయిని గ్రామస్తులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏడాది క్రితం జాయింట్‌ కలెక్టర్‌ మల్లికార్జున పూడిపల్లి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలో ప్రజల విజ్ఞప్తి మేరకు తాగునీటి కోసం గ్రామంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఆయన హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తాము ఏడు కిలోమీటర్ల దూరంలోని పురుషోత్తపట్నం వెళ్లి సత్యసాయి మంచినీటి పథకం నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు.

అంతదూరం వెళ్లలేని వారు గత్యంతరం లేక చెంతనే ఉన్న గోదావరి నదిలోని కలుషిత నీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమీపంలో పూడిపల్లి ఉన్నప్పటికీ, ఈ గ్రామం ఫేజ్‌– 3లో ఉండడంతో ఇప్పట్లో గ్రామాన్ని ఖాళీ చేసే పరిస్థితి లేదు. కానీ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం వల్ల గోదావరి నదికి వరదలు వస్తే ముప్పు తప్పదని పూడిపల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తాము ఇక్కడ నుంచి విడిచిపోయేంత వరకైనా తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement