
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తొమ్మిదేళ్లుగా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలను ఈ దఫా ఒంగోలు నగరంలో నిర్వహించడం చర్చనీయంగా మారింది. తన సోదరుడు, ఎమ్మెల్యే జనార్దన్‌తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా సత్య నగర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్, సత్యల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఫ్లెక్సీల వివాదం రాజుకోవడంతో సత్య తన పుట్టిన రోజు వేడుకలను పట్టుబట్టి ఒంగోలు నగరంలో నిర్వహించుకున్నారు.
భాగ్యనగర్‌లో జరుపుకున్న ఈ వేడుకలకు కొండపి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనార్దన్ ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఇక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న ఆయన ఇకనుంచి ఒంగోలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందిని ఈ వేడుకలకు ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదు. అసెంబ్లీ జరుగుతుందన్న సాకుతో డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా కేంద్రమైన ఒంగోలులో టీడీపీకి ఇప్పటికే రెండు కార్యాలయాలు ఉన్నాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఒకటి భాగ్యనగర్‌లో ఉండగా, గుంటూరు రోడ్డులో జనార్దన్ ఆధ్వర్యంలోని మరో కార్యాలయం ఉంది. తాజాగా సత్య రంగ ప్రవేశంతో మూడో కార్యాలయం సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment