గుడ్లవల్లేరు ఘటనపై నటి పూనమ్ కౌర్
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: విద్యార్థినుల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్రియమైన అమ్మాయిలారా. మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ.. బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన ఈ పరిస్థితులు చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను.
‘నేరస్థులు ఎలా రక్షించబడతారు, బాధితులు ఎలా అవమానింపబడతారు’ అనేది నాకు బాగా అనుభవం. అటువంటి చర్యలతో నేను మానసికంగా అలసిపోయాను. వ్యక్తులు ఎంతశక్తిమంతమైన వారైనా.. వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలామంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలామంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం అనేది నాకు అసహ్యం కలిగించింది. నేరస్థులకు ఎంతటి శక్తిమంతులైనా.. ఎవరు సహకరిస్తున్నా.. ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది’ అని పూనమ్ కౌర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
నిందితులను శిక్షించాలి
బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు చిత్రీకరించారని తెలిసి భయపడిపోయాం. వీటిని ఎందుకు ఏర్పాటు చేశావని అడిగితే.. ఆ విద్యార్థిని నీ దిక్కు ఉన్నచోట చెప్పుకోమని బెదిరించింది. హాస్టల్, కళాశాల యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదు. నిందితురాలికి వత్తాసు పలుకున్నారు. ఇదెక్కడి న్యాయం. నిజాలు నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలి.
– సుజన, హాస్టల్ విద్యార్థిని
వణికిపోతున్నాం
వాష్‌రూమ్‌లో కెమెరాలు పెట్టారని తెలిసినప్పటి నుంచి నాతో పాటు సహచర విద్యార్థినులు ఆందోళనలో ఉన్నారు. ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాం. రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. న్యాయం చేస్తారనుకున్న పోలీసులు పట్టించుకోవాల్సింది పోయి మమ్మల్నే బెదిరిస్తున్నారు. అనుమానితురాలిగా ఉన్న విద్యార్థినికి సకల మర్యాదలు చేసి గదిలో ఉంచుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే వారే కరువయ్యారు. మాకు న్యాయం చేయాలి. – స్వప్న, హాస్టల్ విద్యార్థిని
బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు
న్యాయం చేయాలని విద్యార్థినులందరూ ఆందోళన చేస్తున్నా ఎవరికి తమ గోడు పట్టడం లేదు. నిజాలు నిగ్గు తేల్చి తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భరోసా కలి్పంచాల్సింది పోయి హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తమను బెదిరిస్తున్నారు. పోలీసులే న్యాయం చేయాల్సింది పోయి వారే తమను బెదిరిస్తే తమకు న్యాయం చేసే వారు ఎవరూ. నిందితులను కఠినంగా శిక్షించి తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. – సత్యరాణి, విద్యార్థిని
బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి చిత్రాలను చిత్రీకరించిన ఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఘటనలు చాలా దారుణం. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడే వ్యక్తుల్ని వదలకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – మైల రత్నకుమారి, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం
నమ్మి పంపిస్తే ఇలాంటి మోసాలు చేయొచ్చా
కాలేజీల యాజమాన్యాల మీద నమ్మకంతో పిల్లల్ని మీ దగ్గర వదిలిపెడుతున్నాం. కంటికి రెప్పలా కాపాడాల్సిన చోటే ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరగడం అత్యంత హేయం. ముందుగా కాలేజీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయాలు లేకుండా ఎవరికి వారే మన ఇంటి పిల్లలు అనుకుని నిందితుల్ని పట్టుకుని శిక్షించాలి. – ఎ.సత్యవతి, కృత్తివెన్ను
రాజకీయాలు కాదు వాస్తవాలు కావాలి
గుడ్లవల్లేరు ఘటన చాలా దురదృష్టకరం. దీనికి భాద్యులు ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ పెద్దలు సైతం రాజకీయాలు పక్కనపెట్టి వాస్తవాలను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఆడపిల్లల భవిష్యత్, వారి జీవితాలకు సంబంధించిన విషయం. – జె.ఝాన్సీ, యండపల్లి, కృత్తివెన్ను మండలం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినులకు ఈ దుస్థితి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఈ దుస్థితి దాపురించింది. వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అలాంటిదేమీ లేదని ప్రభుత్వం కితాబివ్వడం అత్యంత హేయం. విద్యార్థినులను కట్టడి చేస్తూ.. కాలేజీ యాజమాన్యం నిందితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థినుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా.. వారిని బలవంతంగా ఇళ్లకు పంపించడం దుర్మార్గం. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
ఏపీలో రక్షణ కరువైంది
ఏపీలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. బాత్ రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే. గుడ్లవల్లేరు ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదు. 9 ఏళ్ల అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేసిన ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా అమ్మాయి శవాన్ని తీసుకు రాలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏం చేస్తున్నట్టు. – ఆర్‌కే రోజా, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment