సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేటాయించి (అసైన్ చేసి) 20 సంవత్సరాలు పూర్తయిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించనుంది. బుధవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వాలు గతంలో తమకు కేటాయించిన భూములను (అసైన్డ్ భూములు) అమ్ముకునేందుకు హక్కు కల్పించాలని పలు జిల్లాల్లో రైతులు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. తమకు కేటాయించిన భూములను పేదలు అనుభవించడం మినహా వాటిపై అమ్ముకునే హక్కులు లేవు. 1954కి ముందు కేటాయించిన భూములను మాత్రమే అమ్ముకునేందుకు హక్కు ఉంది.
ఆ తర్వాత ప్రభుత్వం నుంచి భూములు పొందిన లక్షలాది మంది రైతులు వాటిల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వాటిని అమ్ముకోవడానికి, వాటిపై బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. కాగా, అసైన్డ్ రైతులకు పూర్తి యాజమాన్య హక్కుల విషయంపై గత ప్రభుత్వాలు కమిటీలు వేసినా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకుని అర్హులైన రైతులకు మేలు చేయాలని ఇప్పుడు ప్రభుత్వం భావించింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ పలుమార్లు సమావేశమై అధ్యయనం చేసింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడ అసైన్డ్ భూములపై అర్హులకు హక్కులు కల్పించిన తీరు, అందుకు అనుసరించిన విధానం, పర్యావసానాలు తదితర అంశాలపై ఆ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ చర్చించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా పరిశోధించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను మంత్రివర్గం ఆమోదించనున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల్లో కేటాయించిన వ్యక్తుల చేతుల్లో ఉంటేనే అమ్ముకునే హక్కు ఇవ్వనున్నారు.
22 (ఎ) నుంచి 1.60 లక్షల ఎకరాలకు విముక్తి
గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను 22 (ఎద) జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. గ్రామాల్లో రజక, నాయీబ్రాహ్మణ, కంసాలి, కుమ్మరి, కమ్మరి, బారికి వంటి సేవలు (గ్రామానికి సేవ చేసే వృత్తులు) చేసే వారికి గతంలో ఈనాం కింద భూములు ఇచ్చారు. కాలక్రమంలో వాటిని నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. అలాంటి విలేజ్ సర్వీస్ ఈనాం భూములు రాష్ట్రంలో 1.60 లక్షల ఎకరాలు ఉన్నాయి. వాటిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం ద్వారా లక్షల మందికి మేలు చేకూర్చనున్నారు.
1,700 దళితవాడలకు శ్మశాన వాటికలు
శ్మశాన వాటికలు లేని దళితవాడలకు వాటిని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం 1,700 గ్రామాల్లో 1,000 ఎకరాలు కేటాయించనున్నారు. ఎకరం లోపు భూమిని శ్మశాన వాటికల ఏర్పాటు నిమిత్తం కేటాయించే అధికారాలను కలెక్టర్లకు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment