ఆందోళనకారులు తగలబెట్టిన ఆర్టీసీ బస్సు
అమలాపురం నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ భగ్గుమంది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి.
జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టాయి. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకూ చడీచప్పుడూ లేకుండా... ఒక్కసారిగా వేల మంది యువకులు రోడ్లమీదకు వచ్చి హింసకు తెగబడ్డారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని రెండుమూడు రోజులుగా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి చెబుతూ వస్తోంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో మెసేజులు పంపింది. కానీ సోషల్ మీడియాలో మెసేజీలు అందుకున్న వేల మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ... పెట్రోలు డబ్బాలతో ఆస్తుల్ని తగలబెడుతూ రెచ్చిపోవటంతో ఇదంతా ముందస్తు కుట్ర మేరకే జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరింది. అల్లరి మూకలు రాళ్ల దాడులకు దిగటంతో సాక్షాత్తూ జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
పరిస్థితిని అదుపు చేయడానికి విధిలేక ఒకచోట లాఠీచార్జి చేయటంతో పాటు ఒకదశలో గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.ఆందోళనకారులు అమలాపురంలో దాదాపు ఆరున్నర గంటలపాటు వి«ధ్వంసానికి తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విధ్వంసం... రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగింది.
అమలాపురంలో ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులు
ర్యాలీగా మొదలై.. విధ్వంసం వరకు..
‘కోనసీమ జిల్లాకు మరో పేరు పెట్టవద్దు.. ఆ పేరే ముద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి జేఏసీ అమలాపురంలోని కలశం సెంటర్ నుంచి మంగళవారం మూడు గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నట్లు రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు మంగళవారం అమలాపురం సహా ఆ జిల్లాలోని పలు సున్నిత ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 విధించారు.
అమలాపురానికి బయట వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో పికెట్‌లు ఏర్పాటు చేసి.. సుమారు 450 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్నా... దాదాపు 3 గంటలకు పట్టణంలోని సందులు, చిన్న చిన్న వీధుల్లోంచి ఆందోళనకారులు ఒక్కసారిగా అమలాపురం మెయిన్ రోడ్డులోకి దూసుకొచ్చారు.
ఆర్టీసీ బస్‌స్టేషన్, గడియారం స్తంభం, హైస్కూలు సెంటర్లు, తదితర ప్రాంతాల నుంచి ఒకేసారి వేల మంది రోడ్లపైకి రావడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా లెక్క చేయకుండా ఆందోళనకారులు కలెక్టరేట్ సమీపంలోని నల్లవంతెన వద్దకు వచ్చేసరికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి అదుపు తప్పింది. వీరంతా పాతికేళ్ల లోపు యువకులేనని, అంబేడ్కర్ పేరు వద్దని నినాదాలు చేస్తూ చెలరేగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు.
బస్సుల ధ్వంసం.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు..
నల్లవంతెన వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఆందోళనకారులు వారితో వాదనకు, తోపులాటలకు దిగారు. కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం లాఠీఛార్జ్ చేసి పోలీసులు ఆందోళనకారులను కొంతమేరకు చెదరగొట్టారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన రెండు ప్రైవేటు బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
అమలాపురంలో ఆందోళనకారుల దాడితో మంటల్లో కాలిపోతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు
అంతేకాక కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఉన్న ఒక ప్రైవేటు బస్సును తగులబెట్టారు. అనంతరం అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి.
ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తోపాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం
పెచ్చరిల్లిన విధ్వంసం...
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి నుంచి ఎర్ర వంతెన వద్దకు వెళ్లిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టారు. మరో రెండు బస్సులతో పాటు జిల్లా ఎస్పీ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారిపై తీవ్ర స్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో ఎస్పీ సుబ్బారెడ్డి, భీమవరం డీఎస్పీ రవిప్రకాష్, అమలాపురం రూరల్ సీఐ వీరబాబు, రూరల్ ఎస్‌ఐ పరదేశీతో పాటు 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ ఎస్పీ సుబ్బారెడ్డి
ఎస్పీని కిమ్స్ ఆస్పత్రికి, ఇతర పోలీసులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంత్రి విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిని తగలబెట్టడంతో ఊరుకోని ఆందోళనకారులు ఎర్రవంతెన దిగువన జాతీయ రహదారికి ఆనుకుని మంత్రి నిర్మించుకుంటున్న ఇంటికి కూడా నిప్పంటించారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా వారు మరింత రెచ్చిపోయారు.
ఇంతలో కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన అదనపు పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఏలూరు రేంజ్ డీఐజీ పాల్‌రాజు పర్యవేక్షణలో కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. దీంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు
పోలీసు వలయంలో కోనసీమ
– వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
– సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో పోలీసు పిక్కెట్లు
కోనసీమ అంతటా పోలీసులు మొహరించారు. కోనసీమ కేంద్రం అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ పరిణామాలను రాష్ట్ర డిజిపి తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి కోనసీమ జిల్లాకు పోలీసులను హుటాహుటిన తరలించారు.
ఇప్పటికే అక్కడ ఉన్న 450 మంది పోలీసు బలగాలకు అదనంగా సుమారు వెయ్యి మంది పోలీసులను మొహరించారు. కోనసీమలోని అమలాపురం సహా ముఖ్యమైనన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించడంతో ఆ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు, అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కోనసీమ ఎమ్మెల్యేల ఇంటి వద్ద ఎస్సై, కానిస్టేబుళ్లతో ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాగాన్ని సిద్ధం చేశారు. ఏలూరు రేంజి డీఐజీ పాలరాజ్ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీలు ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఐశ్వర్య రస్తోగి, అమలాపురంలోని పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment