దేశానికి గొప్ప బహుమతి సీఎం జగన్‌  | Rajesh Adani Says CM Jagan is great gift to country | Sakshi
Sakshi News home page

దేశానికి గొప్ప బహుమతి సీఎం జగన్‌ 

Published Thu, May 4 2023 5:05 AM | Last Updated on Thu, May 4 2023 5:05 AM

Rajesh Adani Says CM Jagan is great gift to country - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్వితీయమైన ముందుచూపు ఉన్న నాయకుడు (యూనిక్‌ విజనరీ లీడర్‌). ఏపీ నుంచి దేశానికి లభించిన గొప్ప బహుమతి వైఎస్‌ జగన్‌. గతేడాది ఆంధ్రప్రదేశ్‌ 17 శాతం జీడీపీ వృద్ధి సాధించడమే దీనికి ఉదాహరణ. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఏమాత్రం రాజీ పడకుండా సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో ముందుకు వెళ్తున్నారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు.

ప్రజలందరికీ సంక్షేమం అందిస్తున్న నవరత్నాల పథకాలను చూసి.. ప్రతి రాష్ట్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని అదానీ గ్రూప్స్‌ ఎండీ రాజేష్‌ అదానీ అభిప్రాయపడ్డారు. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్‌–4లో ఏర్పాటు చేయనున్న అదానీ డేటా సెంటర్‌కు సీఎం జగన్‌తో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోర్టులు, పునరుత్పాదక ఇంధన వనరులు, లాజిస్టిక్‌ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో అదానీ గ్రూప్‌ బంధం కొనసాగిస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటికే రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టామని, తద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రైవేట్‌ పోర్టులుగా కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవలే 15 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి ప్రాజెక్టుతో పాటు, ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.

డేటా ఉత్పత్తి, వినియోగం, స్టోరేజ్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీలోనూ రాష్ట్రం ఇకపై దూసుకుపోతుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్, హై డెఫిషియన్స్‌ కంటెంట్, డిజిటలైజేషన్‌పై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు, సుదీర్ఘ సాగర తీరం రెన్యువబుల్‌ ఎనర్జీకి, ఇతర అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ కేవలం డేటాపార్క్‌కు మాత్రమే కాకుండా, ఇంధన ఉత్పత్తి రంగంలోనూ దేశానికి పెద్దన్నగా మారనుందని వివరించారు.   

భారత్‌కు డేటా సెంటర్‌ కేపిటల్‌గా ఏపీ 
దేశంలోని మిగిలిన డేటా సెంటర్లకు.. విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌ డిజిటల్‌ ఎంబసీగా వ్యవహరించనుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజేష్‌ అదానీ స్పష్టం చేశారు. ‘దక్షిణాసియా నుంచి అండర్‌ సీ కేబుల్స్‌ ద్వారా డేటా సెంటర్‌ నెట్‌వర్క్‌ కనెక్ట్‌ అవ్వనుంది. ప్రారంభం నుంచి 100 శాతం గ్రీన్‌ పవర్‌ ద్వారా ఈ డేటాసెంటర్‌ నిర్వహించాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించుకుంది.

దానికనుగుణంగా ప్రాజెక్టుని రూపొందించాం. మొత్తం 300 మెగావాట్లతో రూ.22 వేల కోట్ల పెట్టుబడులుతో ఏడేళ్లలోపు డేటా సెంటర్‌ని భాగస్వాములతో కలిసి దశల వారీగా పూర్తి చేస్తాం. వాక్‌ టూ వర్క్‌ కాన్సెప్ట్‌తో బిజినెస్‌ పార్క్‌ కూడా ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా వేల మందికి ఉపాధి లభించనుంది.

విశాఖపట్నం దేశానికే కాదు.. యావత్‌ ఆసియా దేశాలకు డేటా సెంటర్‌ రాజధానిగా మారనుంది. విశాఖలో ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి డేటా సెంటర్‌ బిజినెస్‌ పార్క్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌.. భారత్‌కు డేటా సెంటర్‌ కేపిటల్‌గా అభివృద్ధి చెందనుంది’ అని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement