సాక్షి, అమరావతి: దేశమంతా ప్రశంసిస్తున్న సచివాలయాల వ్యవస్థపై బురద చల్లేందుకు రామోజీ చేయని ప్రయత్నం లేదు! అవన్నీ బెడిసికొట్టడంతో ఈసారి రూటు మార్చి ఉద్యోగులపై ఎనలేని ప్రేమ నటిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు.
ప్రతి 2,000 జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి పౌర సేవలను ప్రజల వద్దకే చేర్చారు. ఒక్కో సచివాలయంలో 10–11 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లూ అసలీ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థే వృథా అంటూ కథనాలు అచ్చేసిన రామోజీ ఇప్పుడు వారిపై పని భారం పెరిగిందంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు!!
ఈనాడు ఆరోపణ: సచివాలయాల ఉద్యోగులు అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తవం: మూడున్నర ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు జీతాలు పొందుతున్నారు. అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్ (11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారించి ప్రభుత్వం ప్రతి నెలా జీతాలు చెల్లిస్తోంది. 2018లో పీఆర్సీ ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది.
ఆ ప్రకారం గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏతో కలిపి రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరీ ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏతో కలిపి రూ.18,691 ఉంటుంది. అయితే సచివాలయ ఉద్యోగులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న పాత పే స్కేళ్లకు బదులుగా అందరు ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ. పది వేలు పెరిగింది.
ఈనాడు ఆరోపణ: సచివాలయాల ఉద్యోగులు పది వేల మంది రాజీనామా చేశారు.
వాస్తవం: అది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాల్లో 1,04,694 మంది, 3,842 వార్డు సచివాలయాల్లో 34,604 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 1.39 లక్షల మంది (పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో కలిపి) ఉద్యోగులు పనిచేస్తుంటే 2019 నుంచి ఇప్పటి వరకు 6,830 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఉద్యోగులలో 90 శాతం మంది మంచి కంప్యూటర్ పరిజ్ఞానం, బీటెక్ లాంటి ఉన్నత కోర్సులు చదివినవారే. 5 – 10 రెట్ల ఎక్కువ జీతం రావడంతో ప్రభుత్వ ఉద్యోగం వదిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వైపు వెళ్లినట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
ఈనాడు ఆరోపణ: గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు కల్పించకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారారు.
వాస్తవం: గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులు రోజువారీ నిర్వహించాల్సిన విధులకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీవోలు 149, 2 విడుదల చేసింది. ఈనాడు తన కథనంలో ఒకవైపు సచివాలయాల ఉద్యోగులపై అదనపు పనిభారం మోపారంటూ మరోవైపు అధికారాలు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలు మాదిరిగా మారారంటూ పరస్పర భిన్నాభిప్రాయాలను వెలువరించింది.
ఈనాడు ఆరోపణ: పలువురు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇంకా ప్రొబేషన్ ఖరారు చేయలేదు.
వాస్తవం: 2019, 2020లో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,18,334 మంది ఉద్యోగాలు పొందగా 548 మందిపై క్రమశిక్షణ కేసులు పెండింగ్‌లో ఉండడం, 751 మంది డిపార్ట్‌మెంట్ టెస్టులు పాస్ కాకపోవడం, 905మంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం లాంటి కారణాలతో రెండేళ్ల సర్విసు పూర్తి కాకపోవడంతో ప్రొబేషన్ ఖరారు పొందలేకపోయారని సచివాలయాల శాఖ పేర్కొంది. మొత్తం ఉద్యోగుల్లో 98.14% మంది ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తవగా 1.86% మందే పైనపేర్కొన్న కారణాలతో ప్రొబేషన్ ఖరారు పరిధిలోకి రాలేకపోయారు.
ఈనాడు ఆరోపణ: ప్రభుత్వం అన్ని పనులను సచివాలయాల ఉద్యోగులకే చెబుతోంది. జాబ్‌చార్ట్ కంటే అదనపు పనులు అప్పగిస్తోంది.
వాస్తవం: సచివాలయ ఉద్యోగులందరూ శాఖలవారీగా పనుల బాధ్యతను పంచుకుంటారు. అదనపు పని భారానికి అవకాశం లేదు. సచివాలయ ఉద్యోగులకు తమ పరిధిలో అందరూ తెలిసిన వారే ఉంటారనే ఉద్దేశంతో ఓటర్ల జాబితా ప్రక్రియలో తప్పులకు అవకాశం లేకుండా బీఎల్వో బాధ్యతలను కొన్ని చోట్ల అప్పగించారు.
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు ఇంటి పన్ను వసూళ్ల బాధ్యత అప్పగించారన్న ఆరోపణల్లో నిజం లేదు. సచివాలయాల పరిధిలో పాఠశాలలను మాత్రం వారు సందర్శిస్తుంటారు. యూజర్ చార్జీల వసూలు శానిటేషన్ కార్యక్రమాల కిందకే వస్తుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment