పచ్చపైత్యం ప్రకోపించడంతో మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు కథనాలతో జనాన్ని నమ్మించేందుకు వికృత రాతలతో పేట్రేగిపోతున్నారు. చేతిలో ఈనాడు పత్రిక ఉందని వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ అడ్డగోలు కథనాలు అచ్చేయిస్తున్నారు. ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేసేందుకు ప్రతి అంశాన్నీ ఆయుధంగా మలచుకుంటున్నారు. జాతీయ రహదారులపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఓ కథనాన్ని వండేశారు. కానీ వారికి తెలియందేంటంటే... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలోనే జాతీయ రహదారుల నిర్మాణం జోరుగా సాగింది. అంతేగాదు... కొత్త జాతీయ రహదారుల పనులు కూడా ప్రజల కళ్లకు కనపడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పాదనలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏకంగా రూ.71, 200కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం. ఆ నిధులతో ఏకంగా 3,770 కి.మీ.మేర జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.40వేల కోట్లు 2022–23లోనే మంజూరు చేశా రు. ఇక జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కేవలం ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది. అందులో ప్రభుత్వ భూమి 1,571 హెక్టార్లు కాగా ప్రైవేటు భూమి 5,362 హెక్టార్లు.
బాబు చేతులెత్తేస్తే జగన్ పూర్తి చేశారు
► చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.13,353 కోట్లు వెచ్చించగా... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లు ఖర్చు చేసింది.
► గత ప్రభుత్వం నిర్మించకుండా చేతులెత్తేసిన విజయవాడలోని బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓ వర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిన విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణాన్ని కూడా తుది దశ కు తీసుకువచ్చింది ఈ ప్రభుత్వమే.
► గొండిగొలను నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
► విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు తూర్పు బైపాస్ నిర్మాణానికి ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించింది.
వాస్తవాలు మరచి దుష్ప్రచారం
► 2022–23లో కొండమోడు – పేరేచర్ల మధ్య జాతీయ రహదారిని రూ.1,032.52 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. కానీ దేశవ్యాప్తంగా భారత్ మాల ప్రాజెక్టుల కింద మంజూరైన ప్రాజెక్ట్‌లను తదుపరి ఉత్తర్వుల వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 18న ఆదేశించింది. దాంతో టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చినప్పటికీ కాంట్రాక్టును ఖరారు చేయలేదు.
► 2021–22లో ముద్దనూరు–బి.కొత్తపల్లి రహదారిని రూ.1,020కోట్లతో మంజూరు చేశారు. ఆ ప్రాజెక్ట్ టెండరు ప్రక్రియ తుదిదశలో ఉంది.
► 2022–23 వార్షిక ప్రణాళికలో మొత్తం 450 కి. మీ. మేర 9 రహదారుల నిర్మాణానికి రూ.7,807 కోట్లతో ఆమోదించగా అందులో మూడు ప్రాజెక్ట్‌లకు ఎల్‌వోఏ మంజూరు చేయగా మిగిలిన ఆరు ప్రాజెక్ట్‌లు టెండరు దశలో ఉన్నాయి.
► 2023 నవంబర్ 10న కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కెబినెట్ సబ్‌కమిటీ అనుమతి వచ్చే వరకు దేశంలో భారత మాల కింద కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అనంతరం 2017 తరువాత ఆమోదించిన భారత మాల ప్రాజెక్ట్‌లను 20శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించకూడదని మరో నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్‌ల టెండర్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఈనాడు రామోజీరావు వక్రబుద్ధికి నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment