గుడిస కొండలు (ఇన్‌సెట్) వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ జిమ్మీకార్టర్
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యంత అరుదైన సీతాకోక చిలుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా గుడిస గ్రాస్ ల్యాండ్‌లో కనువిందు చేస్తున్నాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, పర్యావరణవేత్త పొలిమాటి జిమ్మీకార్టర్ గుడిస ఘాట్ రోడ్, గ్రాస్ ల్యాండ్‌లో 70 జాతుల సీతాకోక చిలుకల్ని రికార్డు చేశారు. వాటిలో అత్యంత అరుదైన మూడు సీతాకోక చిలుక జాతులు ఉండటం విశేషం. బ్రాండెడ్ ఆరెంజ్ ఆలెట్(బురారా ఒడిపొడియా)ను ఇటీవలే ఆయన రికార్డు చేశారు.
హెస్పెరిడే కుటుంబానికి చెందిన ఈ సీతాకోక చిలుకలు ఇప్పటివరకు హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఎక్కడా కనిపించలేదు. తొలిసారి దక్షిణాదిలోని గుడిసలో దర్శనమిచ్చాయి. శ్రీలంక, బర్మా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లో ఆ జాతి సీతాకోక చిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఉదయించే సమయంలోనూ, చీకటిపడే సమయంలోనూ చురుగ్గా ఉంటాయి. పగలు చాలా అరుదుగా కనిపిస్తాయి.
హిస్టేజ్ కాంబ్రిటమ్ జాతుల మొక్కలపై జీవించే ఈ సీతాకోక చిలుక గుడిసలో లాంటనా మొక్కపై కనిపించింది. పశి్చమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే పియరిడే కుటుంబం, ఏపియాన్ ఇంద్రా జాతికి చెందిన ప్లెయిన్ పఫిన్‌ను గుడిసలో మొదటిసారి గుర్తించారు. హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే నింఫాలిడ్ కుటుంబానికి చెందిన ఎల్లో పాషా(హెరోనా మరాధస్) ఇటీవల గుడిసలో రికార్డయింది. గతేడాది దీన్ని పాడేరు అడవుల్లో తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ రాజశేఖర్ బండి, ఈస్ట్‌కోస్ట్ కన్సర్వేషన్ టీమ్ వ్యవస్థాపకుడు శ్రీచక్ర ప్రణవ్ గుర్తించారు.
పర్యావరణ సమతుల్యం..
అత్యంత అరుదైన సీతాకోక చిలుకలు అక్కడ కనిపిస్తుండడాన్ని బట్టి గుడిస గ్రాస్‌ల్యాండ్ అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పర్వత ప్రాంత(షోలా) గ్రాస్‌ల్యాండ్ గుడిస. తూర్పు కనుముల్లో అత్యంత విశిష్టత కలిగిన మూగజీవాలు, అరుదైన మొక్కలు, పక్షులు, సీతాకోక చిలుకలకు ఇది ఆవాసంగా ఉంది. పర్యావరణ సమతుల్యంతో గొప్ప జీవవైవిధ్యం ఇక్కడ నెలకొందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. దట్టమైన అడవి నుంచి ఈ కొండలపైకి వెళ్లే ఘాట్ రోడ్‌పై ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుంది. కొండలపైకి వెళ్లగానే సరికొత్త లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఎత్తయిన కొండలు, ఆ కొండల్లోంచి ఉదయించే సూర్యుడిని చూడటం గుడిస గ్రాస్ ల్యాండ్‌లో మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు శీతాకాలం గుడిస అందాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కానీ పర్యాటకులు పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలతో కాలుష్యం పెరిగిపోతోందని, గుడిస వైవిధ్యాన్ని పరిరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
చదవండి: ఇక రైతులే డ్రోన్ పైలట్లు
Comments
Please login to add a commentAdd a comment