
ధర్మ దీక్షలో పాల్గొన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తదితరులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర హైకోర్టును తక్షణమే అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ‘రాయలసీమ ధర్మ దీక్ష’ జరిగింది. దర్మ దీక్షకు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ధర్మదీక్షలో పాల్గొన్న వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో నెలకొల్పాలని కోరారు.
కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనానంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాజధానితో పాటు అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేసి శ్రీబాగ్ ఒప్పందానికి విఘాతం కలిగించిందన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాయలసీమకు హైకోర్టు కేటాయిస్తే సాంకేతిక అంశాలను సాకుగా చూపి కోర్టుల్లో కేసులు వేశారన్నారు. కాగా, ధర్మ దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు.