సందర్భం
‘సృజనశీలతను అందరూ అభినందిస్తారు... కానీ అనాగరీకులు మాత్రమే విధ్వంసంలో అందాన్ని చూస్తారు’ అంటాడు కందియ కమలేశ్వరన్ అనే మలేషియన్ గాయకుడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ పాలనతో పాటు విధ్వంసమూ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్ధులపై హత్యాకాండ, గృహ దహనాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు కొత్తగా యూపీ తరహా బుల్డోజర్ సంస్కృతికి తెరతీశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశాలు ఖాతరు చేయకుండా ఆగమేఘాల మీద కూల్చేశారు.
2022 జూన్ 17వ తేదీన ‘యూపీ గవర్నమెంట్ వర్సెస్ జమాతే ఇస్లామీ’ కేసులో సుప్రీం కోర్టు... కూల్చి వేతలు ఒక వర్గాన్ని లక్ష్యం చేసేవిగా ఉండకూడదని పేర్కొంది. కానీ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఆదేశంతో సీఆర్‌డీఏ అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు. సీఆర్‌డీఏ చట్టంలోని 115 సెక్షన్ ప్రకారం ఫైనల్ కన్ఫర్మేన్ ఆర్డర్ ఇవ్వలేదు. 137 సెక్షన్ ప్రకారం ఇచ్చిన నోటీసులకు సమాధానం పొందడానికి సహేతుక సమయం ఇవ్వలేదు.
కృష్ణా కరకట్ట వద్ద నదీతీరాన చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చి వేతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కూల్చివేతతో ముడి పెడుతున్నారు. నిజానికి రాష్ట్ర క్యాబినెట్ తీర్మానంతో జీఓ ద్వారా పొందిన భూమిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని అన్ని అనుమతులతో నిర్మిస్తున్నారు. కానీ ప్రజా వేదికను ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు. నదీ తీరాన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో నివసిస్తున్న చంద్రబాబు నిర్మించిన ఈ ప్రజా వేదిక వల్ల కరకట్టపై తమ రాకపోకలకు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ప్రజా వేదిక వద్దకు ప్రజలు రావడం లేదు, దీంతో కొత్త ప్రభుత్వం ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేసింది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. ‘ఓటుకు నోటు’ కేసు తర్వాత చంద్రబాబు నాయుడు హడావిడిగా హైదరాబాద్ విడిచి కృష్ణా బరాజ్‌కు కుడివైపున కరకట్ట– నదీ ప్రాంతానికి మధ్యలోని ఫ్లడ్ బ్యాంక్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం (లింగమనేని ఎస్టేట్) లోకి మకాం మార్చారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో గుంటూరు జిల్లా పరిధిలో 48 భవనాలు, కృష్ణా జిల్లా పరిధిలో 18 భవనాలతో పాటు ప్రకృతి వైద్యశాల కూడా ‘నదీ పరిరక్షణ చట్టం–1884’ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని స్వయానా అప్పటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2015 జనవరిలో చెప్పడమే కాక, వివిధ శాఖల నుంచి నోటీసులు కూడా ఇప్పించారు. ఇవన్నీ బడాబాబులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేననీ, వీటిని కూల్చి వేస్తామనీ హడావిడి చేశారు. ఈ కూల్చివేసే భవనాల లిస్టులో లింగమనేని ఎస్టేట్ కూడా ఉంది.
వీటి నిర్మాణంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ అక్రమ నివాసంతో పాటు మిగిలిన అక్రమ కట్టడాలను కూడా సక్రమం చేయడానికి, ఫ్లడ్ బ్యాంక్ పరిధిని మార్చడానికి హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం జీఓలు తెచ్చింది. అయితే ఇవేమీ చట్టం ముందు నిలబడేవి కాదు. కృష్ణా బరాజ్‌కు కుడివైపున నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో ముఖ్యమంత్రి నివసించడం ‘రివర్ కన్సర్వెన్సీ యాక్ట్’ను ఉల్లంఘించడమే. ఈ యాక్ట్ ప్రకారం నదిని ఆనుకుని 500 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణాలనూ చేయకూడదు. కాని ముఖ్యమంత్రి నివసిస్తున్న భవనం నదికి వందమీటర్ల దూరంలోనే ఉంది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నాలుగేళ్ళ క్రితం ఉత్తర్వులు ఇస్తూ, నది తీరాన 200 మీటర్ల వరకూ నిషేధిత ప్రాంతంగా, 500 మీటర్ల వరకూ నియంత్రణ ప్రాంతంగా ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ 1996 మార్చి ఎనిమిదో తేదీన విడుదల చేసిన జీఓ నం. 111 ప్రకారం నదికి సమీపాన ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, ఎటువంటి వ్యర్థ పదార్థాలూ నదిలో వదల కూడదు. ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసంతో పాటు ఏ కట్టడానికీ డ్రైనేజ్ సదుపాయం లేదు. అక్కడి రోగులు, స్థానికులు విసర్జించే మలినం కృష్ణానీటిలో కానీ, నదీ సమీపాన బహిరంగ ప్రదేశాలకు కానీ చేరుతోంది.
కేంద్ర పొల్యూషన్ బోర్డు నివేదిక ప్రకారం నదీజలాల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఐదు రోజుల సగటు విశ్లేషణల్లో లీటర్‌కు రెండు మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉండాలి. గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా జలాల్లో బీఓడీ 1.4 మిల్లీగ్రాములుండగా... అదే నీటిలో కరకట్ట వద్ద బీఓడీ 2.6 మిల్లీ గ్రాములకు పెరిగిపోయింది. ప్రమాదకర బాక్టీరియా, వైరస్‌లు, ప్రోటోజోవా యూనిట్లు కరకట్ట జలాల వద్ద చాలా ఎక్కువగా ఉన్నాయి. కంటికి కనిపించని ఈ క్రిములతో కూడిన కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ మోస్ట్ ప్రాబబుల్ నంబర్ ప్రతి వంద మిల్లీ లీటర్లకు అమరావతి వద్ద కృష్ణా జలాల్లో 150గా నమోదు కాగా... అది కరకట్ట వద్ద 210 గా నమోదైంది. ఈ కలుషిత జలాలనే విజయవాడ, గుంటూరు ప్రజలు తాగవలసి వస్తోంది. ఈ నీటిని యధాతథంగా తాగిన అనేక మంది ఆస్వస్థులవుతున్నారు.
కరకట్ట వాస్తవాలు విజయవంతంగా మరుగున పడేసిన పాలకులు రుషికొండ టూరిజం ప్రాజెక్టును మాత్రం ఒక పెద్ద వార్తాంశంగా మార్చేశారు. కొండను తొలిచేసి, పర్యావరణానికి పాతరేసి అక్కడ రూ. 500 కోట్లతో జగన్ మోహనరెడ్డి తనకోసం ప్యాలస్ నిర్మించుకుంటున్నా రంటూ ప్రచారం చేశారు. నిజానికి విశాఖను ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించారు. దీనిలో భాగంగానే పర్యాటక శాఖ రుషికొండపై అన్ని హంగులతో నిర్మాణాలు చేపట్టింది.
విశాఖలో ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ నిర్వహణకు సుమారు రూ. 150 కోట్లు వ్యయం చేశారు. దీనిలో అత్యధిక భాగం విశాఖ స్టార్ హోటళ్ళకు చెల్లించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ హోటళ్ళకు ధీటుగా రిసార్ట్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ వేంగి ఏబీ; కళింగ గజపతి, విజయనగర ఏబీసీ బ్లాక్‌లనూ; వాటిలో సువిశాల సమావేశ మందిరాలు, పెద్ద రెస్టారెంట్, ప్రీమియం విల్లా సూట్స్, ఫిట్‌నెస్ సెంటర్లు నిర్మిస్తున్నారు. సమావేశ మందిరాలు, రెస్టారెంట్, ఫిట్‌నెస్ సెంటర్లు ఉన్న చోట ఏ ముఖ్యమంత్రి అయినా ఎలా నివాసముంటారు? ఇవేమీ గమనించకుండా అది జగన్ నివాసమంటూ ప్రచారం చేశారు.
విశాఖలో తూర్పు నావికా దళం కార్యాలయంతో పాటు అనేక కేంద్ర సంస్థలున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో విదేశాల నుంచి వాణిజ్య నౌకలు వస్తుంటాయి. దేశ విదేశాల నుంచి అధికారులు, నిపుణులు వస్తుంటారు. దీనికి తోడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటివారు వస్తే వారి అవసరాలు తీర్చే విధంగా విలాసవంతమైన విల్లా సూట్స్ నిర్మించారు. ఇవి పూర్తయితే విశాఖలో ఒక వర్గానికి చెందిన స్టార్ హోటళ్ళ టర్నోవర్ దెబ్బతింటుందనే భయంతోనే ఈ రిసార్ట్స్‌పై ప్రతికూల ప్రచారం చేస్తూ జగన్‌మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరు ఫేక్ న్యూస్‌ను ఒక పెద్ద ఆయుధంగా చేసుకుని వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
వి.వి.ఆర్. కృష్ణంరాజు
వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ‘ 89859 41411
Comments
Please login to add a commentAdd a comment