
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌లోకి అనుమతిస్తున్నారు.
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. సర్వ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,123 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,054 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.01 కోట్లు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవితో కలిసి భక్తులను సాక్షాత్కరించారు.
అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయలూగుతూ స్వామివారు దర్శనమిచ్చారు. తర్వాత సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వైభవంగా ఊరేగారు. ఉత్సవ శోభల్లో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు