
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ, ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం)లో ఇటీవల సవరణలు చేసింది. ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక విధాన వ్యూహం, మధ్యకాలిక ఆర్థిక విధానాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పత్రంలో ఆర్థిక శాఖ దీనిని వెల్లడించింది. 2025–26 ఏడాది నాటికి రెవెన్యూ లోటును 2.4 శాతానికి.. ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గించనున్నట్లు అందులో పేర్కొంది.
అప్పుల శాతం కూడా తగ్గింపు
ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులను 2025–26 నాటికి 35.5 శాతానికి తగ్గించాలని కూడా ఆర్థిక శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23)లో ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.30గా ఉంది. అయితే, దీనిని 32.79 శాతానికే పరిమితం చేయనున్నట్లు రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికశాఖ పేర్కొంది.
అంతకుముందు 2021–22 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35% ఉంటాయని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు అప్పులు 32.51 శాతానికి తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ద్రవ్యలోటు 5% ఉంటుందని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు 3.18 శాతానికి తగ్గింది.
కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాల్లో సవరణలు చేసుకున్నాయి. అదే తరహాలో ఏపీ కూడా సవరణలు చేయడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య, రెవెన్యూ లోటును తగ్గించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. పన్ను ఎగవేతలను, లీకేజీలను నిరోధించడం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం పెంచుకోవాలని, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత సమర్ధవంతంగా పన్ను, పన్నేతర ఆదాయాలను రాబట్టుకోవాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment