సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం అమృత్, ఏఐఐబీ నిధులు, ప్లాన్ గ్రాంట్ నిధులు.. మొత్తం మీద రూ.8,216.95 కోట్లను వెచ్చిస్తోంది రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు కలిపి 125 ఉండగా.. 59 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 34 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేయగలుగుతున్నారు. 13 పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టింది. నగరాలు, పట్టణాల్లో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల (ఎంఎల్) తాగునీరు అవసరం కాగా ప్రస్తుత తాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం రోజుకు 1,678 మిలియన్ లీటర్లు. 72 మిలియన్ లీటర్ల నీటిని ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2035 నాటికి రోజుకు 2,700 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని పురపాలకశాఖ అంచనా వేసింది. అంటే ప్రస్తుత వ్యవస్థీకృత సామర్థ్యం కంటే 1,022 మిలియన్ లీటర్లు ఎక్కువ అవసరం. ఆ మేరకు వ్యవస్థీకృత సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
32 మునిసిపాలిటీల్లో ‘అమృత్’ధారలు
లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో అమృత్ పథకం కింద తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1,056.62 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.436.97 కోట్లు, మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.180.77 కోట్లు సమకూరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లలో తాగునీటి సరఫరాకు రూ.2,526.33 కోట్లు వెచ్చించనున్నారు. ఆ 32 మునిసిపాలిటీల్లో అదనంగా రోజుకు 307 మిలియన్ లీటర్ల తాగునీరు అందించనున్నారు. దీనికోసం కొత్తగా 4,36,707 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇస్తారు.
ఏఐఐబీ నిధులతో 50 మునిసిపాలిటీలకు..
ఆసియన్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో మరో 50 మునిసిపాలిటీల్లో ప్రాజెక్టులు చేపట్టారు. మొత్తం 33 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని మొత్తం వ్యయం రూ.5,350.62 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3,487.67 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,494.72 కోట్లు కాగా మునిసిపాలిటీల వాటా రూ.368.23 కోట్లు. మొదటిదశ కింద ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, రెండో దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేపడతారు. ప్లాన్ గ్రాంట్ నిధులతో రాయచోటిలో రోజుకు 35 మిలియన్ లీటర్ల తాగునీరు అందించడంతోపాటు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.340 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు.
పట్టణాల్లో నీటి ఎద్దడికి రూ.8,217 కోట్లతో చెక్
Published Thu, Apr 1 2021 4:31 AM | Last Updated on Thu, Apr 1 2021 4:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment