పల్లెకు పట్టం: వేలల్లో జనాభా.. కోట్లలో అభివృద్ధి  | RS 84 Crore Works In Four Panchayats Of Chittoor District | Sakshi
Sakshi News home page

పల్లెకు పట్టం: వేలల్లో జనాభా.. కోట్లలో అభివృద్ధి 

Published Thu, Dec 15 2022 5:17 PM | Last Updated on Thu, Dec 15 2022 5:55 PM

RS 84 Crore Works In Four Panchayats Of Chittoor District - Sakshi

గంగాధర నెల్లూరు మండలం చిన్నవేపంజేరిలో నిర్మించిన వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రం

పల్లె అంటేనే అభివృద్ధికి ఆమడదూరమనే భావం అందరిలోనూ ఉండేది. గతంలో రోడ్లు లేవు. పక్కా భవనాల్లేవ్‌. పిల్లలు చదువుకోడానికి కనీస  వసతుల్లేవ్‌. ఇక పల్లెవాసులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాలంటే చెప్పులరిగేలా తిరిగినా దరిచేరని దుస్థితిలో పల్లెజనం మగ్గిపోయారు. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక పరిస్థితులు మారాయి. ప్రతి గడపలోనూ ప్రభుత్వ పథకాలు తలుపుతట్టాయి. అవ్వా, తాత, అక్కా చెల్లెమ్మలకు జగనన్న అండగా నిలిచారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆదరిస్తున్నారు. పల్లె ముంగిట్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వెలిశాయి. పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. ఆరోగ్య కేంద్రాలు ఆధునికతను సంతరించుకున్నాయి. వీటన్నింటికీ కోట్లాది రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం పల్లెకు పట్టం కట్టింది. దీంతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. 

సాక్షి, చిత్తూరు: పునర్విభజన తర్వాత జిల్లాలోని ఏడు నియోజవర్గాల్లో మొత్తం 31 మండలాలున్నాయి. ఇందులో 697 గ్రామ పంచాయతీలున్నాయి. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పల్లె స్వరూపం మారింది. అభివృద్ధి పరంగా మూడున్నరేళ్లలో గ్రామాల రూపురేఖలు మారాయి. అభివృద్ధి నినాదంతో ముందుకుపోతున్నాయి. మచ్చుకు కొన్ని గ్రామ పంచాయతీలకే ప్రభుత్వం పారించిన నిధుల వరద చూద్దాం.  

మహాసముద్రానికి రూ.14 కోట్లు 
బంగారుపాళెం మండలంలో 1,290 మంది జనాభా ఉన్న మహాసముద్రం గ్రామానికి రూ.14 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్, పక్కా గృహాలు, రోడ్ల నిర్మాణాల కోసం   రూ.6కోట్ల 79 లక్షలు వ్యయం చేశారు. ఈ గ్రామంలో సంక్షేమ పథకాలకు చేదోడు, జగనన్న తోడు, విద్యాదీవెన, సున్నావడ్డీ కింద రూ.4.5 కోట్లు అందజేశారు. మిగిలిన పథకాలకు పింఛన్‌– రూ.1.8 కోట్లు,  ఆసరా –రూ.49 లక్షలు, విద్యాదీవెన – రూ.18 లక్షలు, రైతు భరోసా – రూ.20 లక్షలు, చేయూత – రూ.22 లక్షలు, ఆరోగ్యశ్రీ – రూ.9 లక్షలు, 

రొంపిచెర్లకు రూ.30.71 కోట్లు 
మండలంలోని 6756 మంది జనాభా ఉన్న రొంపిచెర్ల గ్రామానికి రూ.30.71 కోట్లు ఖర్చు చేశారు.  2 సచివాలయాలు, 2 ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్, షాదీ మహల్, పక్కా గృహాలు, సీసీ రోడ్డు, కాలువల నిర్మాణాలకు రూ.11.87 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాలైన చేదోడు, జగనన్న తోడు, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, సున్నావడ్డీ మొత్తంగా రూ.10.2 కోట్లు చెల్లించారు. వీటితోపాటు పింఛన్‌ – రూ.2.77 కోట్లు, ఆసరా – రూ.2.85 కోట్లు, విద్యాదీవెన – రూ.69 లక్షలు, చేయూత – రూ.1.4 కోట్లు, ఆరోగ్య శ్రీ – రూ.30 లక్షలు వెచ్చించారు.  

బుగ్గ అగ్రహారంలో రూ.30 కోట్లు 
నగరి మండలంలోని 2028 మంది జనాభా ఉన్న బుగ్గ అగ్రహారంలో మొత్తం రూ.30 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పక్కా గృహాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.15 కోట్లు చెల్లించారు. పింఛను –రూ.2.55 కోట్లు, ఆసరా – రూ.1.15 కోట్లు, విద్యాదీవెన – రూ.23 లక్షలు, చేయూత – రూ.75 లక్షలు, ఆరోగ్య శ్రీ – రూ.32 లక్షలు,  చేయూత, జగనన్న తోడు, విద్యాదీవెన, సున్నావడ్డీ ఇలా మొత్తంగా సంక్షేమం కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశారు.  

చిన్నవేపంజేరిలో రూ.9.32 కోట్లు 
జీడీనెల్లూరులోని 910 మంది జనాభా ఉన్న చిన్నవేపంజేరి గ్రామానికి రూ.9.32 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్, గృహ నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.6.15 కోట్లు వెచ్చించారు. పింఛను– రూ.2.33 కోట్లు, రైతు భరోసా – రూ.1.28 కోట్లు, సున్నా వడ్డీ – రూ.15 లక్షలు, ఆసరా –రూ.94 లక్షలు, విద్యాదీవెన – రూ.1.06 కోట్లు, చేయూత – రూ.14.5 లక్షలు, ఆరోగ్య శ్రీ  – రూ.12.9 లక్షలు ఇలా సంక్షేమ పథకాల కోసం రూ.3.17 కోట్లు ఖర్చు పెట్టారు.

పల్లెకు ప్రాధాన్యత 
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. సచివాలయాల ద్వారా గ్రామీణులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అర్హులు ప్రభుత్వ పథకాల కోసం వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. వాటితోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని వర్గాలవారికి మేలు చేయటం ప్రభుత్వ లక్ష్యం.   
 – ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీసీఈఓ 

గ్రామాల్లో వసతులకు పెద్దపీట  
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రోడ్లు, కాలువలు, భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వీటితో పాటు సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు జగనన్న ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. చిన్న చిన్న పల్లెల్లో కోట్ల రూపాయాలు  ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లోనూ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది.    
– శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్‌ 

మా గ్రామానికే రూ.15 కోట్లు  
ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మా గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణా లు చాలా బాగున్నాయి. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. మా పంచాయతీ పరిధిలో రూ.15 కోట్ల వరకూ అభివృద్ధి పనులకు కేటాయించటం ఆనందంగా ఉంది.  
– షర్మిల శరత్, సర్పంచ్, మహా సముద్రం, బంగారుపాళెం

గ్రామ పంచాయతీ బాగా అభివృద్ధి చెందింది 
రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. మూడేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. తాగునీరు, సీసీ రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ఇలాంటి అభివృద్ధి నేను ఎన్నడూ ఇంత వరకు చూడలేదు. రొంపిచెర్లలో మైనారిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగనన్న కృషి చేస్తున్నారు.  
 – అబుబక్కర్, చిన్న మసీదు వీధి, రొంపిచెర్ల

మా ఇంట పథకాల పంట 
మాది పేద కుటుంబం. నా భర్త సైకిల్‌ షాపు నడుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మా కష్టాలు తొలగిపోయాయి. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న తోడు, విద్యాదీవెన, ఆసరా, పక్కా ఇల్లు వంటి అన్ని పథకాలు అందాయి. మూడేళ్లలో మాకు రూ.2.25 లక్షలు లబ్ది చేకూరింది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం.  
– ధనలక్ష్మి, బుగ్గ అగ్రహారం

అభివృద్ధి మెండుగా జరిగింది 
గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరిగాయి. గతంలో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా రోడ్డు సక్రమంగా లేక ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మంత్రి ఆర్కేరోజా ఆస్పత్రి వరకు సిమెంటు రోడ్డు వేయించారు. వీధి దీపాలు పెట్టించారు. సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం  గ్రామంలో నిర్మించారు. కొండ కింద బోరు వేసి తాగునీరందిస్తున్నారు.  
– కుమారస్వామి, రిటైర్డ్‌ రైల్వే అధికారి, బుగ్గ అగ్రహారం

ఆదుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌
గతంలో అనేక ప్రభుత్వాలు చూశాం. వేపంజేరి నియోజవర్గంగా ఉండేది. అయినా అభివృద్ధి కనిపించలేదు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. మాకు అన్ని విధాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేసి కుటుంబంలోని సోదరుడిలాగా ఆదుకుంటున్నాడు. మా కుటుంబం ఆయనకు ఎప్పడూ రుణపడి ఉంటుంది.  
–శ్యామల, చిన్నవేపంజేరి, గంగాధర నెల్లూరు మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement