సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ బస్సులు (ఈ–బస్సులు) ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) సన్నద్ధమవుతోంది. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించే లక్ష్యంతో కొత్తగా వెయ్యి ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆర్టీసీకి అనుమతినిచ్చారు. ఈ బస్సులతో ఏటా కనీసం 51 వేల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేశారు.
ఆర్టీసీ తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో గత ఏడాది ఈ–బస్సులను ప్రవేశపెట్టింది. ఈ మార్గంలో 100 బస్సులను ప్రవేశపెడుతోంది. రెండో దశ కింద రాష్ట్రంలో ఇతర నగరాల్లో వెయ్యి విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఏయే ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టాలో నిర్ణయించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. తొలుత విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో సిటీ సర్వి సులతో పాటు దూరప్రాంత, అంతర్రాష్ట్ర సర్వి సులుగా ప్రవేశపెట్టనున్నారు. మిగతా మూడు నగరాల నుంచి దూరప్రాంత సర్వి సులు నడపాలన్నది ఆర్టీసీ ఉద్దేశం. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపడుతుంది. ఈ ఏడాది ఆగస్టుకు ఈ–బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది.
ఆ తర్వాత దశలో మరో 3 వేల బస్సులు
ఇకపై విద్యుత్ బస్సులనే కొనాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. డీజిల్ బస్సులను అద్దె ప్రాతిపదికన మాత్రమే ప్రవేశపెడతారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 11,214 డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఈ–బస్సులను ప్రవేశపెడతారు. అందుకోసం రానున్న మూడేళ్లలో దశలవారీగా 4 వేల ఇ–బస్సుల ప్రతిపాదనను ప్రభుత్వం గత ఏడాది ఆమోదించింది. అందులో భాగంగానే ప్రస్తుతం వెయ్యి బస్సులను ప్రవేశపెడుతున్నారు. అనంతరం మరో మూడు దశల్లో 3 వేల బస్సులను అందుబాటులోకి తేనున్నారు.
ఇవి కూడా వస్తే తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసులతో కలిపి మొత్తం 4,100 ఈ–బస్సులు అందుబాటులోకి వస్తాయి. దాంతో మొత్తం మీద వాతావరణంలో ఏటా 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఒక ఇ–బస్సు ఒక రూట్‌లో రానుపోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
డిస్కంలతో కలిసి చార్జింగ్ స్టేషన్లు
విద్యుత్ బస్సుల కోసం సొంతంగా చార్జింగ్ స్టేషన్లు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్కంలతో కలసి వీటిని ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రెండో దశలో జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లలో, మూడో దశలో డివిజన్ కేంద్రాలు, రాష్ట్ర సరిహద్దుల్లోని పట్టణాల్లో ఉన్న బస్ స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు.
Comments
Please login to add a commentAdd a comment