సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణలో గోల్డెన్ స్టాండర్డ్‌గా ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాస్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్)ను చెప్పుకుంటాం. కరోనా నిర్ధారణలో దీని తర్వాతే ఏదైనా. అలాంటిది ఆర్టీపీసీఆర్‌కే కొన్ని సార్లు కరోనా చిక్కడం లేదు. చాలామందికి పాజిటివ్ లక్షణాలున్నా నెగెటివ్ ఫలితాలు వస్తున్నాయి. దీంతో అనేక మంది బాధితులు సీటీస్కాన్‌కు పరుగులు తీస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌కు కరోనా చిక్కకపోవడానికి కొత్త వేరియంట్స్ కారణమని, ఇవి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుని శరీరంలో వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి వంద కేసుల్లో 5 కేసులు ఇలాంటివే వస్తున్నాయి. కొంతమంది నెగెటివ్ వచ్చింది కదా అని సాధారణ జ్వరం కింద లెక్కగట్టి ఇతర మందులు వాడుతున్న వారూ లేకపోలేదు. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
సీటీస్కాన్ చేయించుకోవాల్సిందే
కరోనా లక్షణాలుండి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వస్తే సీటీస్కాన్ చేయించుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలుండి, నెగెటివ్ వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎక్స్‌రే చేసినా తెలుసుకునే వీలుందంటున్నారు వైద్యులు. కానీ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చినంత మాత్రాన జ్వరమూ, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి కొనసాగుతుంటే దీన్ని కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
రకరకాల కారణాలు ఉంటాయి
కరోనా లక్షణాలుండి ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వచ్చిందంటే రకరకాల కారణాలు ఉండచ్చు. కొన్ని వేరియంట్స్ దొరక్కపోవచ్చు. మరికొన్ని సార్లు నమూనా సరిగా తీయక పోయినా, పరీక్షల్లో జాప్యం జరిగినా ఇలా పలు కారణాలు కావచ్చు. లక్షణాలుండి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వస్తే వెంటనే ఎక్స్‌రే/సీటీ స్కాన్‌కు వెళితే తీవ్రత తెలుస్తుంది. అంతేగానీ, నెగెటివ్ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు.
– డా.రాంబాబు, నోడల్ అధికారి, కోవిడ్ కంట్రోల్ సెంటర్
ఏపీలో 6,582 పాజిటివ్ కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 35,922 టెస్టులు చేయగా..6,582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా ఒకేరోజు 22 మంది మృతి చెందారు. ఒక్కరోజులో 2,343 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఏపీలో 1,56,77,992 టెస్టులు చేయగా.. 9,62,037 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,09,941 మంది కోలుకోగా 44,686 మంది చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారి సంఖ్య 7,410కి చేరింది. ఆదివారం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment