ఏ సర్టిఫికెట్ ఎవరిస్తారో తెలియదు. ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియదు. మనకిక ప్రభుత్వ సాయం అందదులే అనుకుంటున్న వారి ఇంటికి.. వలంటీర్లే వచ్చి ఏ సర్టిఫికెట్లు కావాలి అని అడిగి మరీ సేవలు చేస్తుంటే.. ప్రజల ముఖాల్లో ఆనందం అంతా ఇంతా కాదు.
జగనన్న సురక్ష శిబిరాల్లో లబ్ధిదారులు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలును వేనోళ్ల కొనియాడుతున్నారు. కొంతమందికి ఇంటి వద్దే వలంటీర్లు సర్టిఫికెట్లు అందజేస్తుంటే.. ఇలాంటి సర్కార్‌ను ఎప్పుడూ చూడలేదంటూ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సురక్ష శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. వేలాది మంది ఇందులో లబ్ధిపొందారు.
పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్
జగనన్న సురక్షలో అధికారుల నుంచి సదరం సర్టిఫికెట్ అందుకుంటున్న ఈమె పేరు షేక్ మీరాబి. పల్నాడు జిల్లా కారెంపూడి మండలం చినకొదమగుండ్ల గ్రామం. మూడు నెలల క్రితం ఆమె భర్త షేక్ ఖాదర్‌కు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కుడి కాలు తీసేశారు. గతంలో ఇద్దరు పని చేసుకుంటూ జీవనం సాగించారు.
3 నెలలుగా భర్త మంచానికే పరిమితం కావడంతో పోషణ కష్టమైంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పలువురు మీరాబీకి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వలంటీర్‌కు చెప్పగా.. వారితో దరఖాస్తు చేయించారు. బుధవారం జరిగిన గ్రామ సభలో సదరం సర్టిఫికెట్‌ను మీరాబీకి అధికారులు అందించారు.
పింఛన్‌కు కూడా అధికారులు దరఖాస్తు చేయించి మంజూరుకు సిఫార్సు చేశారు. త్వరలో దివ్యాంగుల పింఛన్ వస్తుందని తెలిసి మీరాబీ సంతోషానికి అవధులు లేవు. ఎంతో దిగులుతో ఉన్న తనకు సురక్ష శిబిరాల ద్వారా జగనన్న ఎంతో మేలు చేశారంటూ ఆమె కన్నీళ్లతో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రం
ఈమె పేరు సీసా మచ్చూలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి.గొందూరు గ్రామం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, రెండుమూడు సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది.
చివరికి నెలరోజుల తర్వాత ఆ పత్రం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కులధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో జగనన్న సురక్ష ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఒక్కరోజులోనే ఫైసా ఖర్చు లేకుండా అధికారులు పత్రం అందజేశారు. సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించిన జగనన్నకు థ్యాంక్స్ అంటూ ఆనందం వెలిబుచ్చారు.
సులువుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం, గెద్దానాపల్లికి చెందిన జల్లిగంపల పోలారావు ఉన్నత చదువులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అవసరమైంది. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు అతని ఇంటికి వెళ్లినప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం.. అతని దగ్గర నుంచి సర్టిఫికెట్ కోసం వివరాలు, జిరాక్స్‌లు తీసుకుని అధికారులకు అందజేశారు. వారు ఆ దరఖాస్తును పరిశీలించి బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment