చంద్రమౌళిరెడ్డి. వయస్సు 28 సంవత్సరాలు. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగంలో స్థిరపడి పెళ్లికి సిద్ధమవుతున్న వేళ కార్డియాక్ అరెస్టుతో జీవితం అర్ధాంతరంగా ముగిసింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడైన చంద్రమౌళి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
.. ఏది గుండెనొప్పి, ఏది కార్డియాక్ అరెస్టు.. కరోనా నేపథ్యంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడమే ఇందుకు కారణమా? ఎంతో చురుకుగా వ్యాయామం చేస్తున్నా.. రోజువారీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆహార నియమాలు పాటిస్తున్నా.. రేపటి మీద నమ్మకం కలగని పరిస్థితి. కొత్త వేరియంట్‌లతో సరికొత్త భయం ఉదయిస్తోంది.
జిల్లా డెస్క్,కర్నూలు: కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుమ్మినా.. దగ్గినా.. ఒంట్లో వేడి చేసినా.. మూలం కరోనాతో ముడిపడుతోంది. రోజుకో వార్త.. పూటకో ప్రచారం.. కరోనా రూపం మార్చుకోవడం ఏమో కానీ.. మనిషి ఆరోగ్యం మాత్రం దినదిన గండం అవుతోంది. చైనా మొదలుకొని.. మారుమూల పల్లె వరకు ఇప్పుడు ఇదే చర్చ. అసలేమవుతోంది.. ప్రపంచంలో ఏం జరుగుతోంది.. ఇలాంటి ఆలోచనలతో గుండె వేగం పెరుగుతోంది. ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా కార్డియాక్ అరెస్టు కొత్త ప్రశ్నలను తీసుకొస్తోంది. యువతను గందరగోళంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో గుండెవ్యాధుల నిపుణుల సలహాలు, సూచనలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
పెద్దాసుపత్రితో గుండె పదిలం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో 10 ఐసీయూ, 20 జనరల్ వార్డు పడకలు ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ విభాగానికి కేథలాబ్ యూనిట్, హార్టింగ్ మిషన్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలతో పాటు టీఎంటీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి స్టెంట్స్ సైతం ఇక్కడే వేస్తున్నారు.
ఇక కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఈ విభాగం దాదాపు రూ.5 కోట్లతో ఆధునీకరించి 2016 జులైలో పునః ప్రారంభించారు. అత్యాధునిక మాడులర్ ఆపరేషన్ థియేటర్, పది పడకలున్న ఐసీయూ విభాగం కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తోంది. ఇప్పటివరకు అన్ని రకాల గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సలు 600 దాకా నిర్వహించారు.
తరచుగా గుండె పరీక్షలు
► 25 నుంచి 30 ఏళ్లలోపు వారు గుండెపోటు బారినపడటానికి ప్రధాన కారణం ధూమపానం, స్థూలకాయం.
► కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి ఉన్నా, తక్కువ వయస్సులో షుగర్ వచ్చినా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు అధికం.
► కోవిడ్‌కు గురైన వారిలో గుండెపోటు కేసులు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి.
► కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన వాళ్లు గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
► రక్తనాళాల్లో ఏవైనా సమస్యలుంటే అవసరమైన చికిత్స తీసుకుంటే గుండెపోటుకు గురికాకుండా చూసుకోవచ్చు.
కార్డియాక్ అరెస్టు అంటే..
కార్డియాక్ అరెస్ట్ ఆకస్మికంగా వస్తుంది. శరీరంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే అలజడితో పాటు అప్పటికే శరీరంలో ఉన్న ఇతర అనారోగ్య కారణాలు ఇందుకు తోడు కావడం. గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతినడం, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితికి చేరుకుంటారు.
ఎలాంటి వయస్సులోనైనా..
యువకుల్లోనే కాదు ఎవరిలోనైనా సడన్‌గా కార్డియాక్ అరెస్టు రావచ్చు. కరోనా వచ్చిన వారిలోనే కార్డియాక్ అరెస్టు అధికంగా ఉంటుందనే ప్రచారం అవాస్తవం. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు సంబంధం లేదు. వీటిని ముందుగా గుర్తించడం కొద్దిగా కష్టం. ఈసీజీ, ఎకో పరీక్షల్లో కనిపించవు. ఎంఆర్‌ఐ, పెట్సా్కన్ చేసి నిర్ధారించవచ్చు. జిమ్ చేస్తున్న సమయంలో, తీవ్రమైన భావోద్వేగాలు, మానసిక ఆందోళన కారణంగా కరోనరి ధమనులు మూసుకుపోతాయి. దీనివల్ల సడన్‌గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
40 ఏళ్లలోపు వారే అధికం
గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్‌పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స
పొందుతున్నారు.
40 ఏళ్లలోపు వారే అధికం
గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్‌పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు.
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. పనిలో శారీరక శ్రమ తప్పనిసరి. సైకిల్ తొక్కడంతో పాటు వాకింగ్ చేయాలి. గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో స్థూలకాయం ఒకటి. కొవ్వు శాతం అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పండ్లు, తాజా కూరగాయలకు భోజనంలో చోటు కల్పిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళనలను దరి చేయనీయకపోవడం ఉత్తమం.
వ్యాక్సిన్ గుండెపై ప్రభావం చూపుతుందా?
కరోనా వైరస్ నేరుగా గుండె కండరాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టేతత్వం ఎక్కువ అవుతుంది. దీంతో పాటు ఊపిరితిత్తుల్లో, ఇతర అవయవాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టవచ్చు. కాళ్లలో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టి అది ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా చేరవచ్చు. దీనివల్ల రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నç³్పుడు కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. కోవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం లేదు.
హార్ట్ ఎటాక్ లక్షణాలు
ఉదయం వేళల్లో ఎడమ దవడ కింది భాగంలో నొప్పి ప్రారంభమై పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత నొప్పి క్రమేపీ ఛాతీ వైపునకు, అక్కడి నుంచి ఎడమ భుజం, చేతి వేళ్ల వైపునకు వస్తుంది.
కార్డియాక్ అరెస్టు లక్షణాలు
గుండె పనితీరులో ఆకస్మిక తేడాతో స్పృహ కోల్పోవడం లేదా శ్వాసను కోల్పోవడం జరుగుతుంది. గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఆ వెంటనే ఇతర అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది.
గుండె చప్పుడు ఆధారంగా చికిత్స
హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రికి వచ్చిన రోగి గుండెచప్పుడును పరీక్షించి చికిత్స ప్రారంభిస్తాం. ముందుగా ధమనులలో అడ్డంకులు కరగడానికి, నొప్పి ఉపశమనానికి మందులు ఇస్తాం. అధిక రక్తపోటు ఉన్నట్లయితే అందుకు తగిన చికిత్స చేస్తాం. రక్తనాళాలలోని అడ్డంకులు, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత, రోగి వయస్సు మీద ఆధారపడి అప్పటికప్పుడు నిర్ణయం ఉంటుంది. కరోనరీ యాంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింపజేయడం లేదా కరోనరీ బైపాస్ సర్జరీ చేస్తాం.
– డాక్టర్ ఎ.వసంతకుమార్, సీనియర్ కార్డియాలజిస్టు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment