సాక్షి, అమరావతి: ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలను హైలైట్ చేస్తూ వివిధ పధకాల ద్వారా ప్రజలు ప్రయోజనం పొందేలా విస్తృత ప్రచారం కల్పించడం వారి విధుల్లో భాగమే. టీడీపీ హయాంలోనూ అదే జరిగింది. ఇప్పుడు కూడా అంతే. ఒక్క పేరు మార్పు మినహా ఎలాంటి తేడా లేదు. నాడు కంటెంట్ కార్పొరేషన్‌గా వ్యవహరించగా ఇప్పుడు డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా డిజిటల్ కార్పొరేషన్‌గా మార్పు చేశారు.
డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా అభివర్ణిస్తూ కథనాలను ప్రచురించిన ఈనాడుకు వారిలో కొందరు గతంలో తమ వద్ద కూడా పని చేశారనే విషయం తెలుసా? చంద్రబాబు హయాంలో పీఆర్వోలుగా పనిచేసిన వారంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థల్లో పనిచేసిన వారే కదా? ఇక ఏపీడీసీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జీతభత్యాలు, కార్యక్రమాల ప్రమోషన్ల కోసం చేసిన మొత్తం ఖర్చు రూ.88.56 కోట్లు కాగా రూ.500 కోట్లు దోచిపెట్టారంటూ ఈనాడు తప్పుడు కథనాలను అచ్చోసింది. ఏపీడీసీకి నాలుగేళ్లలో సగటున రూ.౨౨ కోట్లు కూడా ఖర్చు కాలేదన్నది వాస్తవం.
♦ గత సర్కారు చంద్రబాబు ఇమేజీని పెంచడానికి గ్రూప్– ఎమ్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లాది రూపాయలు చెల్లించిన మాట వాస్తవం కాదా?
♦ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎమ్‌ఈఐటీవై, ఎమ్‌ఐబీ, డీఏవీపీ లాంటి వాటి మార్గదర్శకాలనే ఏపీడీసీ కూడా అనుసరిస్తోంది. వాటికి అనుగుణంగానే ఏపీడీసీ డిజిటల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ తయారైంది. పద్ధతి ప్రకారం ఇవన్నీ నడుస్తున్నప్పుడు పసలేని విమర్శలు ఎందుకు?
♦ రేట్ కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీడీసీ స్వీకరించింది. దానికి అనుగుణంగానే వెబ్‌సైట్లు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, యాడ్ ఏజెన్సీలు మొదలైన వాటికి ఎంప్యానెల్ చేయడానికి ప్రముఖ జాతీయ, ప్రాంతీయ ప్రింట్ మీడియా పబ్లికేషన్స్‌లో ఆర్‌ఎఫ్‌పీలను ఏపీడీసీ ప్రచురిస్తుంది. అన్నీ సక్రమంగా జరిగాకే ఎంప్యానెల్ ఏజెన్సీలకు ఏపీడీసీ వర్క్ ఆర్డర్లను జారీ చేస్తుంది.
♦ ఏపీడీసీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలను కూడా ఏదో ఒక ఏజెన్సీకి కట్టబెట్టిన సందర్భం లేదు. ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ ఏజెన్సీలకు ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేసింది. కేవలం ఒక మీడియా సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. కార్యక్రమాలు, లక్షిత వీక్షకుల ఆధారంగా వీలైనంత ఎక్కువ మందికి చేరే ప్లాట్‌ఫామ్స్‌కే ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చింది. ప్రకటనల జారీలో వివిధ ఆధీకృత సంస్థలు పాటించే పద్ధతే ఇది.
♦ వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు. ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ కూడా కాదు. ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది.
♦ ఐప్యాక్‌కు ప్రకటనలు ఇస్తున్నారన్నది పూర్తి అబద్ధం. ఐప్యాక్ అనేది ఎంప్యానెల్ అయిన ఏజెన్సీ కాదు. ఐప్యాక్‌కు ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఐడ్రీమ్‌కు కూడా ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు.
♦ రిక్రూట్‌మెంట్ విషయానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం, మీడియాలో అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అర్హతలు ప్రామాణికంగా నియామకాలు జరిగాయి. నియామకాలన్నీ జీఓ 94 ప్రకారమే జరుగుతున్నాయి. గతంలో ఇదే ఉద్యోగులు ఈనాడులో కూడా పనిచేశారు. సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ధనుంజయ్‌రెడ్డి, ముఖ్యమంత్రి సీపీఆర్వో శ్రీహరి తదితరులు ఈనాడులో పనిచేసిన వారే అన్న విషయాన్ని ఆ పత్రిక ఖండించగలదా? ఈనాడులో పని చేసి అక్కడనుంచి సాక్షికి వచ్చారన్నది వాస్తవం. వారికి అర్హతలున్నాయి కాబట్టే ఈనాడు ఉద్యోగాలు ఇచ్చింది. అవే అర్హతల ప్రామాణికంగా సాక్షిలో కూడా ఉద్యోగాలు పొందారు. వాటిని పరిగణలోకి తీసుకుని ఇటు ప్రభుత్వంలోనూ అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. ఈ విషయంలో టీడీపీ, ఈనాడు చేస్తున్నవి అడ్డగోలు వాదనలని ఇక్కడే తేలిపోతోంది.
♦ ఓ కార్పొరేషన్‌గా ఏపీడీసీ వివిధ విభాగాల నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. అన్ని ప్రభుత్వ విభాగాలూ ఏపీడీసీ సేవలను, డిజిటల్ స్పేస్‌లో అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఏపీడీసీ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది.
♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే యత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఏపీడీసీ సంబంధిత వ్యక్తులు, సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉంది.
♦ గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటైన ఏపీ కంటెంట్ కార్పొరేషన్ పేరును మారుస్తూ జారీ చేసిన జీవో 19 ద్వారా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇదేమీ ఇవాళ కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ కాదు. ఏపీడీసీ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రభుత్వం – ప్రజల మధ్య వారధిగా పనిచేయడం.
♦ రాష్ట్ర ప్రభుత్వం సహా అన్ని విభాగాల తరపున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తుంది. ప్రభుత్వాధి నేతగా, ప్రభుత్వ సారథిగా, ఆ కార్యక్రమాల రూపకర్తగా ముఖ్యమంత్రి ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇదేమీ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కాదు. దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురద జల్లడమే.
‘‘డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు వైకాపా కార్యకర్తలే.. సాక్షికి, ఏపీడీసీకి తేడాలేదు.. ఆ రెండింటి పని జగన్‌కు బాకా ఊదడమే’’నంటూ టీడీపీ చేసిన ఆరోపణలను ఒక కథనం రూపంలో 10–10–2023న ‘ఈనాడు’ దినపత్రిక ప్రచురించింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో… pic.twitter.com/5RC5M1Gnlo
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 10, 2023
Comments
Please login to add a commentAdd a comment