Akunuru Balaji Varaprasad: శాండ్‌ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి | Sand Artist Akunuru Balaji Varaprasad in International Sand Art Festival 2022 | Sakshi
Sakshi News home page

Akunuru Balaji Varaprasad: శాండ్‌ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి

Published Fri, Dec 2 2022 3:21 PM | Last Updated on Fri, Dec 2 2022 8:24 PM

Sand Artist Akunuru Balaji Varaprasad in International Sand Art Festival 2022 - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక రేణువులను మునివేళ్లతో తాకుతూ.. అద్భుత శిల్పాలు చెక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్‌. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఒడిశాలోని కోణార్క్‌ చంద్రభాగా బీచ్‌లో జరుగుతున్న ‘అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022’ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొంటున్నాడు. 


చిత్రకళా పోటీల్లో చిన్ననాటి నుంచే అనేక బహుమతులు అందుకున్న బాలాజీ ఆ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ చదివే రోజుల్లో సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి ఇసుకతో ‘మత్స్య సుందరి’ పేరిట సైకత శిల్పాన్ని రూపొందించడం, అది పత్రికల్లో ప్రచురణ కావడంతో శాండ్‌ ఆర్ట్‌పైకి దృష్టి మరల్చాడు. ఎంతో సాధన చేసి సైకత శిల్పిగా, పోర్ర్‌టైట్‌ ఆర్టిస్ట్‌గా, స్పీడ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. 


సైకత కథలకు విశేష స్పందన

భారతీయ ఇసుక శిల్పిగా, యానిమేషన్, కథకుడిగా బాలాజీ రూపొందించిన అనేక సైకత శిల్పాలు, సైకతరూపక కథలకు విశేష స్పందన లభిస్తోంది. వాటిని వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు వీక్షిస్తున్నారు.


ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ అవార్డులు, 8 జాతీయ అవార్డులు, రెండు పురస్కారాలు (ఉగాది, విశిష్ట వ్యక్తి పురస్కారం), రెండు ప్రపంచ రికార్డులు (అద్భుత ప్రపంచం, మేధావి ప్రపంచ రికార్డులు) సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలపై 250కి పైగా ఇసుక శిల్పాలను చెక్కి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. (క్లిక్: పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!)


ఇసుక రేణువులతో చైతన్యం

చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, పెయింటింగ్, కాన్వాసింగ్‌పై మక్కువతో అనేక ప్రయోగాలు చేశాను. సైకత శిల్పాల సృష్టిలోనూ పట్టు సాధించాను. ఎటువంటి సంగీతం, ఇతర పరికరాలు అవసరం లేకుండానే ఇసుక శిల్పాలతో ప్రజలకు అతి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో అంశాలను ప్రదర్శిస్తున్నాను.


2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది సైకత శిల్పులు పాల్గొనగా.. అంతర్జాతీయ ప్రథమ బహుమతి సాధించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీల్లో కచ్చితంగా బహుమతి సాధించాలనే పట్టుదలతో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నాను.
– ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సైకత శిల్పి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement