భీమిలిలో టన్నుకు రూ.758 నుంచి రూ.1,076కి పెంపు
ఒకేసారి రూ.318 పెరగడంతో కొనుగోలుదారుల ఆగ్రహం
ఓ వైపు ఉచితమంటూ ఇంతేసి వసూళ్లా అంటూ నిరసన
భీమునిపట్నం/అగనంపూడి (విశాఖ): ఒక పక్క ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్ప టికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. అయినా రేటు రోజురోజుకు పెంచేస్తున్నారు. బుధవారం భీమిలి ర్యాంపు వద్ద ఒక్కసారిగా టన్నుకు రూ.318 పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఒకటే ధర ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ సారథ్యంలోని కమిటీ ధరలను సమీక్షించింది.
అగనంపూడి, భీమిలి డిపోల్లో టన్ను రూ.1,076 కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో భీమిలి వద్ద ధర పెరగ్గా, అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి వద్ద మంగళవారం టన్ను రూ.758కి ఇవ్వగా, బుధవారం ఒక్కసారిగా రూ. 1076కు పెరగడంతో కొనుగోలుదారులు నిరసనకు దిగారు. ఉచిత ఇసుకపేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలి. దీంతో ఇసుక భారం మోయలేనంతగా పెరిగింది.
ఉచితమని ప్రకటించి ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేస్తున్నా గత్యంతరం లేక విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు భీమిలి వద్ద ఇసుక కొంటున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వారంతా షాక్ తిన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా పెంచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి లారీలు తెచ్చామని, ఇప్పుడు పెరిగిన రేటుకు ఇసుకను కొనలేక ఖాళీ లారీలతో వెనక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితమన్న పేరుతో ఇలా దోచేస్తే ఇళ్లెలా కట్టుకొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరను తగ్గించి ఇసుకను అందివ్వాలని డిమాండ్ చేశారు.
ఒక్కసారిగా పెంచేస్తే ఎలా కొనగలం?
ఇసుక ధరను ఇలా పెంచుతారని ఎవరూ ఊహించలేదు. ఉదయం ర్యాంపు వద్దకు లారీలు తీసుకొస్తే... రేటు పెంచినట్టు తెలిపారు. టన్నుకు రూ.300 పైనే పెంచేశారు. ఉచితమని చెబుతూ ఇలా రేటు ఒక్కసారిగా పెంచేస్తే తట్టుకునే పరిస్థితి లేదు. – తుపాకుల సురేష్, మజ్జివలస
ఉచితమని ప్రకటించడం ఎందుకు?
ఇసుక ధర ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించడం ఎందుకు? కనీసం పాత ధరకు కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల్లోనే ధర ఇలా పెంచేయడం పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? – జి.శ్రీను, ఆనందపురం
Comments
Please login to add a commentAdd a comment