చీరాల: ఓవ్యక్తి అప్రమత్తతతో వ్యవహరించడంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం 7:15నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళుతూ పట్టాలు దాటుతున్న స్థానికుడు గద్దె హేమసుందరబాబు రైలు పట్టా విరగడాన్ని గమనించాడు. అదే సమయంలో చెన్నై వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోంది. వెంటనే రైలుకు ఎదురెళ్లి లోకో పైలెట్‌కు రైలు పట్టాలు చూపిస్తూ సైగలు చేస్తూ సంకేతాలు పంపించాడు.
అప్రమత్తమైన లోకోపైలెట్ రైలు వేగం తగ్గించి రైలును నిలిపివేశాడు. అనంతరం రైలు పట్టా విరిగి ఉందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. చీరాల, బాపట్ల నుంచి వచ్చిన రైల్వే ఇంజనీరింగ్ అధికారులు విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
కాగా పెను ప్రమాదం నుంచి తప్పించిన హేమసుందరబాబును రైల్వే అధికారులతో సహా ప్రయాణికులు ప్రశంసించారు. ఘోర ప్రమాదాన్ని నివారించిన గద్దె హేమసుందరబాబు సాహసాన్ని అభినందిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆయనను ఘనంగా సత్కరించారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment