భారతీయ రైళ్లు దేశంలోని లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఒక్కోసారి రైళ్లు నడిపే పైలట్ల పొరపాటు కారణంగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఉదంతం యూపీలో చోటు చేసుకుంది.
నిర్ణీత వేగ పరిమితి కంటే అధిక వేగంతో రైళ్లను నడిపిన ఇద్దరు లోకో పైలట్లు (డ్రైవర్), రైలు సహాయకులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు, వారి సహాయకులపై రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించిన సెక్షన్‌లో 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతున్నందుకు వారిని సస్పెండ్ చేశారు. రైలు బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కారణంగా తాత్కాలిక వేగ పరిమితి అమలులో ఉన్న ఆగ్రా కాంట్‌కు సమీపంలోని జాజౌ- మణియన్ రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు సిబ్బంది వేగంగా రైలును పోనిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది.
ఆగ్రా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్‌ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సంఘటనలో రైలు ఆగ్రా కాంట్ నుంచి గ్వాలియర్‌కు బయలుదేరిన తర్వాత గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వేగ పరిమితిని ఉల్లంఘించారు. మరో ఘటనలో కత్రా (జమ్మూ)- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య నడిచే మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ కూడా నిబంధనలను ఉల్లంఘించారు. ఈ సెక్షన్‌లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల నది వంతెన మరమ్మతు పనుల కారణంగా గంటకు 20 కిలోమీటర్ల పరిమితిని నిర్ణయించారు.
ఈ విషయమై ఆపరేషన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ వారు చెప్పిన సెక్షన్‌లో లోకో పైలట్‌లు రైలు వేగాన్ని తగ్గించడం మరచిపోయి ఉండవచ్చు. అయినా ఇది రైలు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే చర్య. అందుకే రైల్వే శాఖ దీనిని సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సాధారణంగా ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం తదితర సందర్భాల్లో రైల్వేశాఖ ఆ రూట్‌లో వైళ్లే రైళ్లకు వేగ పరిమితులను విధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment