సాక్షి, అమరావతి: మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నిబంధనల ప్రకారం ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేవని స్పష్టత వచ్చాకే ఎన్నికల కొనసాగింపునకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ దాకా జరిగాయి, ఏవి ఎక్కడ ఆగిపోయాయన్న దానిపై సమీక్షించానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు తదితరులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘రాష్ట్రంలో ఏడాది కిందట మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది జనవరి 8వ తేదీనే తిరిగి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా 2020 మార్చి 14వ తేదీకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. కరోనా కారణంగా అప్పుట్లో ఎన్నికల వాయిదా పడ్డాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలు అప్పుడే ఖరారయ్యాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆ ఎన్నికలను కొనసాగించకుండా ఉండడానికి ఎటువంటి కారణాలు లేవు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 8వ తేదీ ఎన్నికల పోలింగ్, 9న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తాం. 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి..’ అని వివరించారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో అక్కడ నుంచే మొదలు పెట్టినట్టు చెప్పారు. నోటిఫికేషన్ విడుదలతో పోటీలో ఉన్న అభ్యర్థులు శుక్రవారం నుంచే ప్రచారం కొనసాగించుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ గురువారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోను, పోలింగ్ సమయంలోను కరోనా జాగ్రత్తలు తీసుకునేలా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.
ఏకగ్రీవాలపై ఇప్పటికే కోర్టు తీర్పిచ్చింది
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు నీలం సాహ్ని బదులిచ్చారు. ‘ఎన్నికలు ఇంకా ఆపడానికి నిబంధనల ప్రకారం ప్రత్యేకించి ఏ కారణాలు లేవు. ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యమయ్యే కొద్ది కరోనా వాక్సినేషన్ సమస్యలున్నాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అన్ని పరిస్థితులు పరిశీలించాక ఇప్పుడు ఎన్నికలు కొనసాగించడమే సముచితమం’ అని భావించినట్టు చెప్పారు.
అందరి సహకారం అవసరం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్చగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లు, రాజకీయ పార్టీలు సహా అందరి సహకారం అవసరమని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారినుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి ఫిర్యాదులు, వినతులు వచ్చినా సత్వరమే పరిష్కరిస్తామని ఆమె చెప్పారు.
ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్
Published Sat, Apr 3 2021 3:12 AM | Last Updated on Sat, Apr 3 2021 8:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment