
సాక్షి, పిఠాపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన భద్రత అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు జిల్లాల పర్యటనల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది.
కాగా, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత సరిపోలేదని ఇది వరకే పలుమార్లు వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రతను కుదించింది. ఇక, వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా భద్రతా లోపం బయటపడుతున్నప్పటికీ కూటమి సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై వైస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కారుపైకి కొందరు యువకులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు యువకులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. అలాగే ఈరోజు ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిపాడ్ కిక్కిరిసిపోయింది. ఇక్కడ తగినంత భద్రతను పోలీసులు కల్పించలేదు. అయితే, వైఎస్ జగన్ అంటే గిట్టని వారు అభిమానుల ముసుగులో ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడులను గుర్తు చేస్తున్నారు.