మెడి‘కిల్స్‌’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం | Side Effects And Dangers With Self Medication | Sakshi
Sakshi News home page

మెడి‘కిల్స్‌’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం

Published Sat, May 8 2021 8:00 AM | Last Updated on Sat, May 8 2021 10:14 AM

Side Effects And Dangers With Self Medication - Sakshi

పటమటకు చెందిన వెంకట్‌కు 45 ఏళ్లు.. గత కొన్నేళ్లుగా సుగర్‌తో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన తీసుకోకుండా ఎవరో స్నేహితులు మాటలు, సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మి.. వేరే ఎవరికో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం మందులు వాడాడు. అందులో స్టెరాయిడ్స్‌ ఉండటంతో  సుగర్‌ లెవల్స్‌ విపరీతంగా పెరిగిపోయి పరిస్థితి విషమంగా మారింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన వ్యక్తి ఆస్పత్రి ఇంటెన్సివ్‌ కేర్‌తో చికిత్స పొందాల్సి వచ్చింది. 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్‌గా పనిచేస్తుందని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్‌ని, మరొకరు పాజిటివ్‌ రాగానే సొంతంగా వాడేస్తున్నారు. అలాంటి వారిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, అవసరం మేరకు మాత్రమే వాడాలి. అంతేకానీ ప్రివెంటివ్‌ పేరుతో మందులు విచ్చలవిడిగా వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగి, అవసరమైనప్పుడు ఆ మందులు  పనిచేయకుండా పోతాయని చెబుతున్నారు.  

అపోహలు.. సొంత వైద్యాలు.. 
మొదటి వేవ్‌ సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, మీజిల్స్‌–రూబెల్లా వ్యాక్సిన్, ఐవర్‌మెక్టిన్, హెచ్‌ఐవీ బాధితులకు వాడే లొపినావీర్‌ 50, రిటోనావీర్‌ 200 వంటి మందులను వైద్య రంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్‌ లేదు కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటిని వాడుతున్నారు.

ఇక ఇటలీలో కరోనా రోగికి పోస్టుమార్టం చేశారని, రక్తనాళాల్లో బ్లాక్స్‌కు ఆస్పిరిన్‌ వాడితే సరిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్, ఎకోసై్పన్‌ మందులను వాడేస్తున్నారు. వాటితో పాటు వైరల్‌ జ్వరాలు వచ్చినప్పుడు వాడే ఫాబి ఫ్లూ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇక విటిమిన్‌ సీ, డీ, జింక్, మందులను రెగ్యులర్‌గా వేసే వాళ్లు ఉన్నారు.

ఒకరి ప్రిస్క్రిప్షన్‌.. మరొకరు.. 
కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను, తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్‌ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకుని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మందులు వాడాల్సి ఉంది. అలా కాకుండా మధుమేహం ఉన్న వారు సైతం స్టెరాయిడ్స్‌ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుండా కొన్ని రకాల మందులతో డ్రగ్‌ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు.

నష్టాలే ఎక్కువ.. 
యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వైరస్‌ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్‌ వంటి యాంటిబయోటిక్‌ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూబుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాక యాంటిబయోటిక్స్‌ ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగి, జబ్బు చేసినప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.

వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి..  
ఇప్పటి వరకు కరోనాకు ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్యం చేస్తున్నారు. ఆ మార్గదర్శకాల్లో ఫాబి ప్లూ మందులేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కూడా తొలగించడం జరిగింది. కరోనా సోకిన తర్వాత లక్షణాలు ఆధారంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది.

శరీరంలో పారామీటర్స్‌ పెరిగినట్లు స్టెరాయిడ్‌ లాంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆస్పిరిన్, ఎకోస్పైన్‌ మందులు రక్తం పలచపడటానికి వాడతాం. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఉండటంతో ఎక్కువగా వాడుతున్నారు. అయితే బ్రెయిన్‌లో గాయాలు ఉన్న వారు. రక్తం గడ్డకట్టే గుణం కోల్పోయిన వ్యాధులు ఉన్న వారు ఈ మందులు వాడకూడదు. కరోనా నుంచి రక్షించేది టీకా మాత్రమే. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. 
– డాక్టర్‌ విజయ్‌ చైతన్య, కార్డియాలజిస్ట్‌

చదవండి: వ్యాక్సినేషన్‌లో అందరికీ ఆదర్శంగా ఏపీ 
పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement