![Singer Shanmukha Priya Native Place Of Parvathipuram In Vizianagaram - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/12/Singer-Shanmukha-Priya_0.jpg.webp?itok=77XWE9AS)
సీతానగరం(పార్వతీపురం): సుమధుర గానంతో దేశంలోని సంగీత ప్రియులు, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న గాయని, సోనీ టీవీ 12వ ఇండియన్ ఐడల్ ట్రోఫీ తుది పోటీల్లో తలపడుతున్న షణ్ముఖప్రియ మన పార్వతీపురం అమ్మాయే. ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు స్వరపదనిసలను ఇక్కడే నేర్చుకున్నారు. తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ నెల 15న జరిగే ఇండియన్ ఐడల్ ట్రోఫీ ఫైనల్ పోరులో నిలిచారు. ఓటేసి గెలిపించాలంటూ ఆమెతో పాటు అభిమానులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్వర పరిచయం చేసిన పార్వతీపురం
షణ్ముఖ ప్రియకు పార్వతీపురం పట్టణానికి విడదీయరాని బంధం ఉంది. ఆమె తల్లి రత్నమాల పట్టణంలోని అగ్రహారం వీధిలో జన్మించారు. వీణ వాయిద్యంలో దిట్ట. రత్నమాలకు వయోలిన్ విద్వాంసులు శ్రీనివాస్ కుమార్‌తో వివాహం జరిగింది. షణ్ముఖ ప్రియ అమ్మమ్మ పార్వతీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఉపాధ్యాయిని. తల్లిదండ్రులిద్దరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నప్పటినుంచే షణ్ముఖప్రియ సంగీతంలో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె కుటుంబం కొన్నాళ్లు విశాఖపట్నంలోను, ప్రస్తుతం ముంబయిలో నివసిస్తున్నట్టు ఇక్కడి వివేకానంద కాలనీవాసులు చెబుతున్నారు. మన ఊరు అమ్మాయి గెలుపునకు సోనీలివ్, ఫస్ట్‌క్రైడాట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఓటేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment