సాక్షి ప్రతినిధి, అనంతపురం: నెలకు రూ.194 కోట్లు.. ఏడాదికి రూ. 2,328 కోట్లు.. మన రాష్ట్రంలో మొబైల్ ఫోన్ వినియోగదారులు చెల్లిస్తున్న బిల్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దైనందిన జీవితంలో విడదీయరానిదిగా మారిన మొబైల్ ఫోన్ల బిల్లులకు ఇంతమొత్తం వెచ్చిస్తున్నాం. సాక్షాత్తు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లెక్కలే ఇవి. రాష్ట్రంలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారోనని ట్రాయ్ లెక్కలు వేసింది.
అక్టోబర్ 30 నాటికి 96,96,152 మొబైల్ (సాధారణ, స్మార్ట్) ఫోన్‌లు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ మన రాష్ట్రంలోని చిరునామాలతో ఉన్న సిమ్‌కార్డులే. ఇతర రాష్ట్రాల్లో సిమ్‌కార్డులు తీసుకుని వినియోగిస్తున్నవారు కూడా పెద్దసంఖ్యలోనే ఉంటారు. మొత్తం మీద రాష్ట్రంలో 97 లక్షల మొబైల్ ఫోన్లు వాడకంలో ఉన్నాయని అంచనా. ఒక్కొక్కరు నెలకు రూ.200 వంతున వ్యయం చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.194 కోట్ల బిల్లు కడుతున్నారు. సంవత్సరానికి రూ.2,328 కోట్లు చెల్లిస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. చాలామంది రూ.500 నుంచి రూ.వెయ్యికిపైగానే చెల్లించేవారున్నారు.
30 శాతం ఫోన్‌లు 25 ఏళ్లలోపు వారి దగ్గరే
రాష్ట్రంలో ఉన్న మొబైల్ ఫోన్‌లలో 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు వారి చేతుల్లోనే 30 శాతం వరకు ఉన్నట్టు తేలింది. సగటున ఈ వయసు వాళ్లు రోజుకు 3 గంటలకుపైగా సెల్‌ఫోన్ వాడుతున్నారు. 30 ఏళ్లు, ఆపైన వయసు వారు 2 గంటల లెక్కన వాడుతున్నారు. యువకులు ఎక్కువగా టాక్ టైమ్ (మాట్లాడటం) కంటే సామాజిక మాధ్యమాలు అంటే వాట్సాప్, ఫేస్‌బుక్ తదితరాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలామందికి సెల్‌ఫోన్ వినియోగం వ్యసనంగా మారినట్టు కూడా తేలింది. పనిగంటలకు తీవ్ర అంతరాయం కలగడమేగాక.. అనేకమంది విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏటా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల సంఖ్య 10 నుంచి 15 శాతం పెరుగుతున్నట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment