అనంతపురంలోని పాతూరుకు చెందిన స్వాతి (పేరు మార్చాం) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బెంగళూరుకు చెందిన అబ్బాయి వలలో పడింది. ఉన్నఫళంగా ఒకరోజు ఇంటినుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. చివరకు పోలీసుల జోక్యంతో అమ్మాయిని వెతికి ఇంటికి తెచ్చారు. ధర్మవరానికి చెందిన అమ్మాయి కావ్య (పేరు మార్చాం) అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఒకరోజు ఉన్నఫళంగా అబ్బాయితో వెళ్లిపోయింది. ఇరవై రోజుల తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా కనుక్కుని అమ్మాయిని తీసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అబ్బాయితో వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. వీరిద్దరే కాదు ఎంతోమంది స్మార్ట్‌ఫోన్లలో సామాజిక మాధ్యమాల ద్వారా ముక్కూమొహం తెలీని వ్యక్తులు విసిరిన వలలో చిక్కుకుని మోసపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు కచ్చితంగా తమ పేరుపై ఖాతాలు తెరిచేస్తున్నారు. ప్రతిదీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయమవుతున్నారు. అలా చాటింగ్‌తో స్నేహం పెంచుకుంటున్నారు.
ప్రత్యక్షంగా వారిని చూడకపోయినా.. వారి గుణగణాలు, నేపథ్యం తెలియకపోయినా గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో అమ్మాయిలను కొందరు అబ్బాయిలు ట్రాప్‌లో పడేస్తున్నారు. క్రమక్రమంగా అమ్మాయిలు తమ కెరీర్‌ను పక్కనపెట్టి పోకిరీల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి మాధ్యమాల ద్వారా నష్టపోతున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కొంపముంచుతున్న ఇన్‌స్టాగ్రామ్
ఇటీవలి కాలంలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులంటూ పరిచయమైన ఈ ఫోన్‌లు ఇప్పుడు పర్సనల్ ఖాతాల వరకూ వెళ్లాయి. ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా చాటింగ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామన్న కనీస అవగాహన కూడా లేకుండా అబ్బాయిలకు వ్యక్తిగత వివరాలు షేర్ చేస్తున్నట్టు వెల్లడైంది.
దీన్ని కొందరు అబ్బాయిలు అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. అమ్మాయిలు నష్టపోయే వరకూ వాస్తవ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిలు నష్టపోయాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని చదువు మాన్పిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది వ్యవధిలో 71 మంది అమ్మాయిలు ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అబ్బాయిల వలలో పడినట్టు తేలింది.
బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ
సామాజిక మాధ్యమాల బాధితుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు ఎక్కువయ్యాయి. నెలకు ఐదారు కేసులు వస్తున్నాయి. తల్లిదండ్రుల కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచి అబ్బాయిలను మందలించి పంపిస్తున్నాం. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు షేర్ చేయద్దు.
–ఆళ్ల శ్రీనివాసులు, డీఎస్పీ, ‘దిశ’ పోలీస్ స్టేషన్
వ్యసనంగా మారింది
రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షితులు కావడమనేది ‘ఎమోషనల్ డిపెండెన్సీ’ అంటారు. ఆ గ్రూపులో తిరిగే వారిని బట్టి కూడా ఉంటుంది. ముందుగా దీనిపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. నాలుగు రోజుల కిందట 8వ తరగతి అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ కోసం ఏడుస్తోందని తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చారు. ఇలా అలవాటు చేయడం వల్ల వాళ్లు దానికి బానిసల్లా మారి నష్టపోతున్నారు.
–డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం
(చదవండి: ‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం.. యాజమాన్యం లెటర్ డ్రామా.. విద్యార్థికి సీరియస్!)
Comments
Please login to add a commentAdd a comment